తెలంగాణ

telangana

ETV Bharat / business

తుది శ్వాస విడిచిన ఐటీసీ ఛైర్మన్‌ దేవేశ్వర్‌ - మోదీ

కార్పొరేట్​ దిగ్గజం ఐటీసీ చైర్మన్​ దేవేశ్వర్​ శనివారం కన్నుమూశారు. 1968లో ఐటీసీలో చేరిన ఆయన వివిధ స్థాయిల్లో పని చేసి సుదీర్ఘ కాలం ఛైర్మన్​గా కొనసాగారు. తుది శ్వాస వరకు ఆ సంస్థలోనే ఉన్నారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోదీ సహా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ఐటీసీ చైర్మన్​ దేవేశ్వర్​

By

Published : May 12, 2019, 7:08 AM IST

ఐటీసీ ఛైర్మన్‌ వైసీ దేవేశ్వర్‌(72) శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన జీవితంమంతా ఐటీసీలోనే పని చేశారు. కిందిస్థాయి నుంచి ఛైర్మన్​ స్థాయికి ఎదిగారు. ఆ సంస్థను ఎఫ్​ఎంసీజీగా మలిచిన ఘనత ఆయనదే. వైసీడీగా కార్పొరేట్‌ రంగానికి దేవేశ్వర్​ సుపరిచితులు. ఓ సంస్థకు ఛైర్మన్​గా సుదీర్ఘ కాలం కొనసాగిన కొద్దిమందిలో ఆయన ఒకరు.

5వేల కోట్ల నుంచి 50వేల కోట్లకు...

దేవేశ్వర్‌ 1968లో ఐటీసీలో చేరారు. ఆ తర్వాత క్రమంగా ఎదుగుతూ 1996 నాటికి ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ స్థాయికి చేరారు. ఆయన నేతృత్వంలో సంస్థ బాట్‌ నుంచి టేకోవర్‌ ముప్పును విజయవంతంగా బయటపడింది. అనంతరం ఎఫ్‌ఎంసీజీ రంగంలోకి దిగి విజయవంతంగా ముందుకు దూసుకెళ్లింది. ఐటీసీ ఆదాయం రూ.5,200 కోట్ల నుంచి రూ.51,000 కోట్లకు చేరింది. ఏటా ఐటీసీ వాటాదారులకు 23.3శాతం రాబడిని అందిస్తోంది.

పద్మభూషణ్​

2011లో పద్మభూషణ్‌ అవార్డును అందుకొన్నారు దేవేశ్వర్​. భారతీయ కార్పొరేట్‌ చరిత్రలో సుదీర్ఘకాలం ఒక దిగ్గజ కంపెనీకి ఛైర్మన్‌గా కొనసాగిన అతికొద్ది మందిలో దేవేశ్వర్‌ ఒకరు. 2017 వరకు ఆయన ఐటీసీకి సీఈఓగా కూడా పనిచేశారు. 2018 జనవరిలో ఐటీసీ ఆయన్ను 2022 వరకు ఛైర్మన్‌గా కొనసాగించాలని నిర్ణయించింది.

ప్రధాని సంతాపం

ఐటీసీ చైర్మన్​ దేవేశ్వర్​ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఆయన తోడ్పాటు మరువలేనిదని ట్వీట్​ చేశారు. ఆయన మరణం కలచి వేసిందన్నారు. దేశీయ సంస్థ అయిన ఐటీసీని విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. దేవేశ్వర్​ కుటుంబానికి, సన్నిహితులకు, ఐటీసీ వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details