పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ మరోసారి రుణ సంబంధ చిక్కుల్లో ఇరుక్కున్నారు. మూడు చైనా బ్యాంకులకు ఇవ్వాల్సిన 680 అమెరికన్ డాలర్ల బాకీని తిరిగి చెల్లించాలని అనిల్‌కు ఆదేశాలు జారీ చేసింది బ్రిటన్ హైకోర్టు. మొదటగా రానున్న ఆరు వారాల్లో 100మిలియన్ అమెరికన్ డాలర్లు చెల్లించాలని సూచించింది. ఈ నేపథ్యంలో తాను డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో లేనని, తనపై ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ సాయం చేసేందుకు తన కుటుంబం కూడా సిద్ధంగా లేదని ఆయన కోర్టుకు విన్నివించారు. అయితే అనిల్ అంబానీ విజ్ఞప్తిని తోసిపుచ్చారు న్యాయమూర్తి. ఆరువారాల్లోగా100 మిలియన్ అమెరికన్ డాలర్లు డిపాజిట్ చేయాల్సిందేనని షరతులతో కూడిన ఉత్తర్వులను జారీ చేశారు.
యూకే న్యాయస్థానం ఆదేశాలను సవాల్ చేసే యోచనలో ఉన్నట్లు రిలయన్స్ గ్రూప్ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి. ఇందుకోసం అప్పీల్ చేసుకునేందుకు కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.