వ్యక్తిగత గోప్యత, సమాచార భద్రత విషయంలో లోపాలతో ఫేస్‌బుక్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు ఏకంగా 500 కోట్ల డాలర్ల భారీ జరిమానా విధించింది అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్-ఎఫ్టీసీ. సమాచార భద్రతపై కొత్త నిబంధనలు రూపొందించి ఫెడరల్ ట్రేడ్ ఏజెన్సీకి సమర్పించాలని ఆదేశించింది. వినియోగదారుల గోప్యత నిబంధనలు పాటించని కంపెనీలపై విధించే అత్యధిక జరిమానా ఇదే కాగా.. ఎఫ్టీసీ చరిత్రలో కూడా ఇదే అతిపెద్ద జరిమానా అని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం విధించిన జరిమానా......ఫేస్‌బుక్ గోప్యత నిబంధనలన్నింటిలో సమూల మార్పు చేసి ఇలాంటి ఉల్లంఘనలు చేయకుండా నిరోధించడానికి కూడా తోడ్పడుతుందని అభిప్రాయపడింది. వందల కోట్ల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడంలో ఫేస్‌బుక్ చేసిన ప్రమాణాలు నిలుపుకోలేదని ఎఫ్టీసీ ఛైర్మన్ జో సిమోన్స్ వ్యాఖ్యానించారు. ఎఫ్టీసీలోని ఐదుగురు కమిషనర్లలో ఇద్దరు మాత్రం ఫేస్‌బుక్‌కు విధించిన 5బిలియన్ డాలర్ల జరిమానా తక్కువేనని అభిప్రాయపడ్డారు.