కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో ప్రఖ్యాతి గాంచిన గూగుల్ ఉద్యోగి టిమ్‌నిట్ గెబ్రూ నిష్క్రమణ ఆ సంస్థలో ఇప్పుడు పెద్ద దుమారమే రేకెత్తిస్తోంది. ఓ పరిశోధన పత్రం విషయంలో సంస్థ మేనేజ్‌మెంట్‌కు.. ఆమెకు మధ్య తీవ్ర విబేధాలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఏఐలో రూపుదిద్దుకొంటున్న ఓ కొత్త విభాగం సామాజిక సమస్యలకు దారితీసే అవకాశం ఉందని గెబ్రూ లేవనెత్తడమే వివాదానికి కారణమైనట్లు సమాచారం. నల్లజాతికి చెందిన గెబ్రూ ఆ వర్గం నుంచి వచ్చిన అద్భుతమైన కంప్యూటర్ శాస్త్రవేత్తగా.. ఏఐ హానికర ఉపయోగాలపై ప్రశ్నించే నిపుణురాలిగా పేరుగాంచారు.
ఓ ఉద్యోగి నిష్క్రమణతో గూగుల్లో దుమారం! - గూగుల్ లేటెస్ట్ న్యూస్
గూగుల్ ఉద్యోగి టిమ్నెట్ గెబ్రూ.. నిష్క్రమణతో సంస్థలో పెద్ద దుమారమే చెలరేగింది. అయితే.. సంస్థ తనను తొలగించిందని గెబ్రూ ప్రకటించగా.. గూగుల్ మాత్రం ఆమె రాజీనామా చేసినట్లు వెల్లడించింది. దీంతో వివాదం వెలుగులోకి వచ్చింది. అసలేమైంది.. వివాదం ఏంటి..?
ఈ విషయంలో తనను సంస్థ తొలగించిందని గెబ్రూ ప్రకటించగా.. గూగుల్ మాత్రం ఆమె రాజీనామా చేసినట్లు వెల్లడించింది. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో గెబ్రూకు సంస్థ ఉద్యోగుల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. ఇప్పటికే దాదాపు 1200 మంది ఉద్యోగులు ఆమెకు మద్దతుగా బహిరంగ లేఖ రాశారు. గెబ్రూ తొలగింపు అనూహ్య నిర్ణయమని పేర్కొన్నారు. సంస్థ జాతివివక్ష, రక్షణాత్మక ధోరణితో వ్యవహరిస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
గెబ్రూ ఆకస్మిక నిష్క్రమణ ఇప్పుడు గూగుల్ సంస్థ విశ్వసనీయతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నట్లు కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ''డోంట్ బీ ఇవిల్'' అన్న లక్ష్యానికి సంస్థ ఇప్పుడు చాలా దూరంగా వెళ్లిపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేనేజ్‌మెంట్‌ను సవాల్ చేసిన ఉద్యోగులను తొలగించడం సాధారణ విషయంగా మారిపోయిందని ఆరోపిస్తున్నారు.