అన్ని ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్చాలన్న నీతిఆయోగ్ ప్రతిపాదనను దిగ్గజ వాహన తయారీ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ మార్పు ఆటోమొబైల్ రంగాన్ని తిరోగమనంలోకి నెట్టేస్తుందని.. ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని హీరో మోటోకార్ప్ లిమిటెడ్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ సంస్థలు అభిప్రాయపడ్డాయి.
2025కల్లా 100 శాతం బైక్‌లు, ఆటోలు విద్యుత్‌తో నడిచేలా చేసేందుకు.. తదనుగుణ చర్యలు తీసుకోవాలని ఆటో మొబైల్ రంగాన్ని గతవారం కోరింది నీతిఆయోగ్. 2 వారాల్లోగా ఈ అంశంపై స్పందించాలని స్పష్టం చేసింది.
అయితే.. ఈ నీతిఆయోగ్ ప్రతిపాదన.. సాధ్యమయ్యే పనికాదని వాహన తయారీ సంస్థలు పేర్కొన్నాయి. ఆధార్ కార్డు ముద్రించినంత సులభంగా.. ప్రస్తుతం తయారు చేస్తున్న వాహనాలను విద్యుత్తులోకి మార్చడం ఇప్పట్లో సాధ్యం కాదని పేర్కొన్నారు టీవీఎస్ మోటార్స్ ఎండీ వేణు శ్రీనివాసన్.
''ఇది ఆధార్ కార్డు కాదు. సాఫ్ట్‌వేర్, ప్రింట్ కార్డులు కాదు. మొత్తం సరఫరా చెయిన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రస్తుత వ్యవస్థ నుంచి దానికి మళ్లాల్సి ఉంటుంది. తగిన ప్రణాళికలను 4 నెలల్లో రూపొందిస్తామని చెప్పాం. అత్యధిక ద్విచక్ర వాహనాలున్న ఒక నగరంతో ప్రారంభించి, క్రమంగా విస్తరించుకుంటూ వెళ్లాలి. ''