యాపిల్, కోక్, నైక్.. ఇలాంటి పెద్ద సంస్థలు బ్రాండ్‌ను ప్రచారం చేసుకునేందుకు వినూత్న ప్రకటనలు ఇస్తాయి. అందులో కొన్ని ప్రకటనలు వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. అయితే ఇందుకు భిన్నంగా కొన్ని సంస్థలు ప్రకటనల జోలికే పోవు. అయినప్పటికీ బిలియన్ డాలర్ల మార్కెట్‌ను సంపాదించాయి. అలాంటి టాప్ 6 బ్రాండ్లు ఇవే..
జరా..
తమ అమ్మకాల్లో కేవలం 0.3% ప్రకటనలకు ఖర్చు పెట్టి.. వస్త్ర విపణిలో తిరుగులేని స్థానం సంపాదించింది 'జరా'. వివిధ రకాల మోడళ్లతో కుర్రకారును విపరీతంగా ఆకర్షించే బ్రాండ్లలో ఇది ఒకటి. యాడ్స్ ఇవ్వకుండానే.. భారీగా ప్రచారం దక్కించుకుంది ఈ సంస్థ.
రోల్స్ రాయ్స్...
'రోల్స్ రాయ్స్' కార్ల గురించి టీవీలో ప్రకటనలు రావడం ఎప్పుడైనా చూశారా? కానీ ఈ బ్రిటిష్ లగ్జరీ కార్ల గురించి తెలియని వారు ఉండరు. ఈ కారు తమ దగ్గర ఉండటమే.. ఒక బ్రాండ్‌గా భావిస్తుంటారు ధనవంతులు, ప్రముఖులు.
షహ్నాజ్ హుస్సేన్...
వినియోగదారుల దృష్టిలో మంచి నాణ్యత గల సంస్థ అన్న పేరు తెచ్చుకోవడమే అన్నింటికన్నా గొప్ప ప్రచారం అంటారు వ్యాపార నిపుణులు. అలాంటి పేరు తెచ్చుకున్న సంస్థ 'షహ్నాజ్'. మూస ప్రకటనల జోలికి పోకుండా కేవలం నాణ్యతనే నమ్ముకొని ఈ స్థాయికి చేరుకుంది. మహిళలకు నాణ్యమైన ఆయుర్వేద సౌందర్య ఉత్పత్తులు అనగానే మొదటగా ఈ బ్రాండే గుర్తొస్తుంది.
టప్పర్‌వేర్ (భారత విపణి)...
ప్రపంచ ప్రఖ్యాత వస్తు తయారీ సంస్థ 'టప్పర్‌వేర్'. గ్లాస్, ప్లాస్టిక్‌తో గృహ సంబంధ వస్తువుల తయారీలో ఈ సంస్థదే అగ్రస్థానం. ఎర్ల్ టప్పర్ మొదటిసారి ప్లాస్టిక్ కంటైనర్‌ను కనిపెట్టినప్పటి నుంచి వీటికి డిమాండ్ పెరిగింది. మహిళలు ఈ బ్రాండ్ పట్ల అమితంగా ఆసక్తి కనబరుస్తారు. ఈ సంస్థ ఎన్నడూ ప్రకటనల జోలికి పోలేదు.
నేచురల్స్ ఐస్‌క్రీమ్...
'నేచురల్స్ ఐస్‌క్రీమ్' గురించి తెలియని వాళ్లుంటారా? పంచదార, పాలు, పండ్లు ఇలాంటి వాటిని వినియోగించి తయారయ్యే ఈ బ్రాండ్ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఆరోగ్యపరంగా ఈ బ్రాండ్ మంచిదని పేరుంది. ఈ సంస్థ పెద్దగా యాడ్స్ ఇవ్వదు. వినియోగదారుల నోటి మాటే ఇంతటి ప్రచారాన్ని తెచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో దాదాపు 10% వాటా ఈ సంస్థకు ఉంది.
క్రిస్పీ క్రీమ్...
నాణ్యమైన డోనట్స్ అనగానే గుర్తొచ్చే పేరు 'క్రిస్పీ క్రీమ్'. సంప్రదాయ ప్రకటనల వైపు కాకుండా నాణ్యతపైనే దృష్టి పెట్టే సంస్థల్లో ఇది ఒకటి. టీవీ, డిజిటల్, యాప్స్, సామాజిక మాధ్యమాలు ఇలా ఎందులోనూ ఈ సంస్థ ప్రకటనలు కనిపించవు.
వ్యాపార విస్తరణకు, అభివృద్ధి కోసం లక్షలకులక్షలు ఖర్చుపెట్టి ప్రకటనలు చేస్తుంటాయి పలు సంస్థలు. అదే డబ్బు నాణ్యతను పెంచుకోవడానికి వినియోగిస్తే... అంతకన్నా ఎక్కువ ప్రచారం దక్కుతుందనడానికి ఈ సంస్థలే ఉదాహరణలు.