ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ... భారత పీసీ మార్కెట్లో ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎంఐ ల్యాప్‌టాప్‌ను జూన్‌లో భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపింది.
కరోనా సంక్షోభం, లాక్డౌన్ల వల్ల... ఉద్యోగులు ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రం హోమ్) చేస్తున్నారు. కనుక ఇకపై ల్యాప్‌టాప్‌లకు మరింత డిమాండ్ పెరిగే అవకాశముందని షియోమీ భావిస్తోంది.
"ప్రస్తుతం భారత మార్కెట్లో 20-50 పీసీ మోడళ్లు ఉన్నాయి. మా కంపెనీ పరిశోధన ప్రకారం... ప్రస్తుతం దేశంలో 'పర్సనల్ కంప్యూటర్స్' కేటగిరీ బాగా దూసుకుపోతోంది."
- రఘు రెడ్డి, షియోమీ ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్
ధర ఇప్పుడే చెప్పం!
షియోమీకి పరిమిత సంఖ్యలో ఎస్కేయూ (స్టాక్ కీపింగ్) యూనిట్లు ఉంటాయని రఘు తెలిపారు. ఎంఐ శ్రేణి ల్యాప్‌టాప్‌లతో పెద్ద సంఖ్యలో వినియోగదారులను ఆకర్షించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. అయితే ఈ ల్యాప్‌టాప్‌ల ధర ఎంత ఉంటుందో మాత్రం ఆయన చెప్పలేదు.
మరిన్ని ఎంఐ ఉత్పత్తులు?
ఈ ఏడాది ప్రారంభంలో, షియోమీ తన ఎంఐ బ్రాండ్ కింద మరిన్ని ఉత్పత్తులను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. వినియోగదారులకు మరింత ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇవ్వడమే తమ ధ్యేయంగా పనిచేస్తున్నట్లు పేర్కొంది.
పీసీ మార్కెట్ క్షీణత
పరిశోధన సంస్థ ఐడీసీ ప్రకారం, 2020 మార్చి త్రైమాసికంలో భారత్‌లో పీసీ మార్కెట్ 16.7 శాతం క్షీణించి,1.8 మిలియన్ యూనిట్లకు పరిమితమైంది. దీనిలో విద్యా విభాగం, వినియోగదారుల నుంచి డిమాండ్ పడిపోవడం వల్ల నోట్‌బుక్ కేటగిరి 16.8 శాతం మేర క్షీణించింది. కరోనా సంక్షోభానికి ముందు గేమింగ్, సన్నని-తేలికపాటి నోట్‌బుక్‌లకు చాలా మంచి డిమాండ్ ఉండేది.
అగ్రస్థానంలో హెచ్‌పీ
డెస్క్‌టాప్, నోట్‌బుక్ విభాగాల విషయానికి వస్తే, 2020 జనవరి-మార్చి త్రైమాసికంలో 28.2 శాతం వాటాతో హెచ్‌పీ అగ్రస్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో డెల్ టెక్నాలజీస్ (25.9 శాతం), తైవానీస్ టెక్ దిగ్గజం ఆసుస్ (23-25 శాతం), లెనోవా (20 శాతం) ఉన్నాయి.
లాక్డౌన్ సడలించిన తరువాత పర్సనల్ కంప్యూటర్ల అమ్మకాలు అసాధారణ రీతిలో పుంజుకుంటాయని పీసీ రంగ దిగ్గజాలు ఆశిస్తున్నాయి.
ఇదీ చూడండి:జెన్ జెడ్ స్పెషల్ శాంసంగ్ 'గెలాక్సీ ఏ51' విడుదల