తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్​ ఇదే - ఇంటర్నెట్​ స్పీడ్​

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్​ను పరీక్షించారు యూనివర్సిటీ కాలేజీ లండన్​ పరిశోధకులు. దీని వేగం 178టీబీ. ఈ వేగాన్ని అందుకోవడానికి పరిశోధకులు సాధారణ ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌కు బదులు.. అధిక శ్రేణి కలిగిన తరంగ దైర్ఘ్యాలను వినియోగించారు.

Worlds-Fastest-Internet-Speed-at-178-TBPS
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్​ ఇదే

By

Published : Aug 22, 2020, 4:56 PM IST

ఒకప్పుడు మన ఫోన్లో ఓ ఫొటో లోడ్‌ అయితే సంబరపడిపోయేవాళ్లం. అలాంటిది ఇప్పుడు ఏకంగా నిమిషాల్లో సినిమాలు డౌన్‌లోడ్‌ చేసేసుకుంటున్నాం. ఇప్పటికీ హెచ్‌డీ కంటెంట్‌ చూడాలంటే మాత్రం మన ఇంటర్నెట్‌ వేగం సరిపోదు. దీని కోసం ఇంటర్నెట్‌ స్పీడ్‌ను మరింత పెంచే ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా యూనివర్సిటీ కాలేజీ లండన్‌ పరిశోధకులు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ను పరీక్షించారు. దీని వేగం 178 టీబీ. అంటే సెకనుకు 1,78,000 జీబీలు అన్నమాట. ప్రపంచంలో ఇప్పటివరకు ఇదే అత్యధిక వేగం అంటున్నారు పరిశోధకులు.

గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరుమీద ఉండేది. అప్పట్లో 44.2 టీబీపీఎస్‌ వేగాన్ని అందుకుని వారు రికార్డు సృష్టించగా.. తాజాగా రాయల్‌ అకాడమీ డాక్టర్‌ లిడియా గాల్డినో నేతృత్వంలోని పరిశోధకులు ఆ రికార్డును బ్రేక్‌ చేశారు. దానికి నాలుగు రెట్ల వేగవంతమైన ఇంటర్నెట్‌‌ను పరీక్షించి సత్తా చాటారు. ఈ వేగాన్ని అందుకోవడానికి పరిశోధకులు సాధారణ ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌కు బదులు.. అధిక శ్రేణి కలిగిన తరంగ దైర్ఘ్యాలను వినియోగించారు. అంతేకాదు.. సిగ్నల్‌ను విస్తరించేందుకు కొత్త యాంప్లిఫైయింగ్‌ టెక్నాలజీ, 16.8టీహెచ్​జెడ్​ బ్యాండ్‌ విండ్త్‌ను ఉపయోగించారు.

ప్రస్తుతం భారత్‌లో ఇంటర్నెట్‌ సగటు వేగం 2ఎంబీపీఎస్‌గా ఉంది. దీంతో పోల్చుకుంటే ఈ డేటా కొన్ని వేల రెట్లు అధికం. ఈ వేగంతో సుమారు 1500 4కె సినిమాలను ఒక్క సెకన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీనికయ్యే ఖర్చు గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని, ఆప్టికల్‌ కేబుళ్లతో పోలిస్తే యాంప్లిఫయ్యర్లను అప్‌గ్రేడ్‌ చెయ్యడం అంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదని అంటున్నారు ఈ పరిశోధకులు. అయితే, ఇది కేవలం ప్రయోగం మాత్రమే.. ఇప్పట్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు!

ఇదీ చూడండి:-ట్రంప్‌ నిషేధించినా ఆ వెబ్‌సైట్‌ నడిపిస్తాం!

ABOUT THE AUTHOR

...view details