కరోనా మహమ్మారి విలయతాండవానికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కానీ, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక దాన్ని కొనుగోలు చేసి, పంపిణీ చేయడం పెద్ద సవాలని ఇప్పటికే చాలామంది నిపుణులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భారత్ లాంటి అధిక జనాభా కలిగిన దేశంలో ఇది క్లిష్టమైన వ్యవహారమని చెప్పారు. తాజాగా ఇదే అంశంపై మాట్లాడారు ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) సీఈఓ అదర్ పూనావాలా. అంతేకాదు కేంద్ర ప్రభుత్వానికి ఓ ప్రశ్నను సంధించారు.
కొవిడ్ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి, పంపిణీ చేయడానికి.. వచ్చే సంవత్సర కాలంలో కేంద్రం రూ.80వేల కోట్లను ఖర్చు చేయగలదా?అని ప్రశ్నించారు. దీనికి సంబంధించి ఆయన ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ.. ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు.