'భారత్‌లో వ్యాపారం చేసేటప్పుడు భారతీయుడిలానే అలోచించాలి' అన్న విషయాన్ని మన ఆటోమొబైల్ మార్కెట్ మరోసారి విదేశీ కంపెనీలకు గుర్తు చేసింది. అమెరికా కంపెనీలు భారతీయుడి నాడి పట్టుకోలేకపోతున్నాయి. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన కొన్నేళ్లలోనే పోటీ నుంచి తప్పుకొంటున్నాయి. తాజాగా ఆ జాబితాలో అమెరికా దిగ్గజం ఫోర్డు కూడా చేరింది. గత ఐదేళ్లలో ఫోర్డుతో కలిపి ఆరు కంపెనీలు భారత్‌ను వీడాయి. వీటిల్లో జనరల్ మోటార్స్, ఫోర్డ్, హార్లీడెవిడ్‌సన్,యూఎం మోటార్ సైకిల్స్ అమెరికావే కావడం గమనార్హం. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి విదేశీ కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. కియా వంటి కొత్త కంపెనీలు వేగంగా భారతీయులను ఆకట్టుకోగా.. ఎంతో అనుభవం ఉన్న ఫోర్డ్ తయారీని నిలిపివేసింది.
భవిష్యత్తు భారత్‌దే..!
పశ్చిమ దేశాల వారితో పోలిస్తే భారతీయులు కార్ల విషయంలో కొంత భిన్నంగా ఆలోచిస్తారు. ఇక్కడ మధ్యతరగతి ప్రజలు ఎక్కువ. ఆదాయాల్లో తేడా కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడి ప్రజలను పట్టణ, గ్రామీణ ప్రాంతాలుగా చూడాల్సి ఉంటుంది. పట్టణ ప్రాంత ప్రజల వాహన అవసరాలు .. గ్రామీణ ప్రాంత అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. పశ్చిమ దేశాలతో పోలిస్తే సొంత కారు యజమానుల సంఖ్య కూడా తక్కువే. 2018 నాటికి ప్రతి 1000 మందిలో కేవలం 22 మందికి మాత్రమే సొంత కార్లు ఉన్నట్లు నీతిఆయోగ్ చీఫ్ అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. అదే సమయంలో అమెరికాలో ఈ సంఖ్య 980, బ్రిటన్లో 850గా ఉన్నాయి. కానీ 2040 నాటికి భారత్‌లో సొంతకార్లు ఉన్న వారి సంఖ్య ప్రతి 1000 మందిలో 175కు చేరుతుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ లెక్కగట్టింది. 130 కోట్ల జనాభాను పరిగణనలోకి తీసుకుంటే భవిష్యత్తులో కార్ల కొనుగోళ్లు వెల్లువెత్తనున్నాయి.
ఇటీవల కాలంలో మధ్య తరగతి ప్రజలు కార్ల కొనుగోలుకు మొగ్గు చూపడం పెరిగింది. చాలా దేశాలతో పోలిస్తే తలసరి ఆదాయం కూడా తక్కువే. జపాన్ కంపెనీ సుజుకీ, దక్షిణ కొరియాకు చెందిన హ్యూందాయ్‌లు భారతీయుల నాడిని పట్టాయి. హ్యూందాయ్ అనుబంధ సంస్థ కియా కూడా వేగంగా భారత్‌లో మంచి మార్కెట్ వాటాను దొరకబట్టుకోవడానికి కారణం ఇదే. సుజుకీ కంపెనీ భారత్‌లో మారుతీతో చేతులు కలపడం కలిసొచ్చింది. భారతీయుల అభిరుచులకు తగ్గట్లు కార్లను తయారుచేసింది.
చౌకలో మంచిరకం అనిపించుకోవాలి..
మధ్యతరగతి వారు అందుబాటు ధరలో ఉన్న కార్లకు తొలి ప్రాధాన్యం ఇస్తారు. అదే సమయంలో వారు మైలేజ్, లుక్స్, ఫీచర్స్ బాగున్న కంపెనీల వైపు మొగ్గు చూపిస్తున్నారు. సర్వీసింగ్‌ను కూడా భారతీయులు పరిగణనలోకి తీసుకొంటారు. తక్కువ ధరకు పలు ఫిచర్స్ ఇచ్చి.. లుక్స్ ఆకట్టుకోకపోయినా భారతీయులు మొగ్గుచూపరు. దీనికి మంచి ఉదాహరణ జనరల్ మోటార్స్ (షవర్లే) కంపెనీ తయారు చేసిన బీట్ కారు. భారతీయులను ఆకట్టుకొనేందుకు ‘బీట్’ చిన్నకార్లలో డీజిల్ వెర్షన్‌ను తీసుకొచ్చింది. దీనిలో ఫీచర్లు, మైలేజీ అన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి. పైగా అంతర్జాతీయ బ్రాండ్ జనరల్ మోటార్స్ పేరు ఉండనే ఉంది. కానీ, ఈ కారు జీఎం మార్కెట్ షేరులో పెనుమార్పును తీసుకురాలేకపోయింది. ఈ ప్రయోగం కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ కారు మరీ చిన్నదిగా కనిపిస్తుండటంతో కస్టమర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు.
వేగంగా కొత్త మోడళ్లు..