తెలంగాణ

telangana

ETV Bharat / business

విపణి: దేశీయ స్టాక్​ మార్కెట్లకు ఏమైంది? - వ్యాపార అనుకూల విధానాలు

ఆశించినట్టే కేంద్రంలో మరోమారు భాజపా అధికారంలోకి వచ్చింది. తొలి దఫాలో మోదీ ప్రారంభించిన సంస్కరణల రథం మరింత జోరుతో పరుగులు తీస్తుందన్న విశ్లేషణలకు తావిచ్చింది. అయితే.. ఇదంతా మూణ్నాళ్ల ముచ్చటే. బడ్జెట్​ ప్రవేశపెట్టినప్పటి నుంచి స్టాక్​మార్కెట్లకు నష్టాలే. ఎందుకిలా? దిద్దుబాటు ఎలా?

విపణి: దేశీయ స్టాక్​ మార్కెట్లకు ఏమైంది?

By

Published : Aug 3, 2019, 1:56 PM IST

గత కొద్ది వారాలుగా భారత్ స్టాక్​మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. జులైలో సెన్సెక్స్ 4.86 శాతం, నిఫ్టీ 5.69 శాతం పతనమయ్యాయి. 2018 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు నమోదైన అత్యంత భారీ క్షీణత ఇదే.

ఫలితంగా జులై 5న కేంద్ర బడ్జెట్​ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు భారత మూలధన మార్కెట్​ నుంచి రూ.13.7 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. గత 17 సంవత్సరాల్లో స్టాక్​మార్కెట్​ ట్రేడింగ్​లో ఇదే అత్యంత చెత్త పనితీరు.

రివర్స్ బేరం

2019 జులైలో దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.17,915.14 కోట్లు విలువైన ఈక్విటీలు కొనుగోలు చేశారు. ఇదే సమయంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐ) మాత్రం 1,623.13 మిలియన్ డాలర్ల విలువైన వాటాలను విక్రయించారు. ఇది స్టాక్​మార్కెట్​ పతనానికి కారణమైంది.

రూపాయి మారకం రేటు, ముడిచమురు ధరలు లాంటి అంశాలు కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ దేశీయ స్టాక్​మార్కెట్లు నష్టాల ఊబిలో కూరుకుపోవడం మరింత ఆందోళన కలిగించే అంశం.

ఇలాంటి విపత్కర సమయంలో మార్కెట్​ నష్టాలకు గల కారణాలపై తక్షణం ఆత్మపరిశీలన చేసుకుని, దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పొరపాటు ఎక్కడ?

ప్రపంచంలోని ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే భారత స్థూల ఆర్థిక మూలాలు చాలా బలంగా ఉన్నాయి. అయినప్పటికీ విదేశీ పెట్టుబడిదారులు తమ ఈక్విటీలను విక్రయించడానికే మొగ్గుచూపుతున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశం.

ఈ విషయాన్ని మదుపర్ల అంచనాల కోణం నుంచి చూడాలి. భారీ మెజారిటీతో ఎన్నికైన కేంద్ర ప్రభుత్వంపై మార్కెట్ వర్గాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. వ్యాపార అనుకూల విధానాలు ప్రవేశపెడుతుందని ఆశించారు కూడా. అయితే అత్యంత ధనవంతులపై సర్​ఛార్జ్​ పెంచాలని 2019-20 కేంద్ర బడ్జెట్​లో చేసిన ప్రతిపాదన మార్కెట్లను తీవ్ర నిరాశకు గురిచేసింది. అంటే ఊహలకు, వాస్తవికతకు ఉన్న తీవ్ర వ్యత్యాసమే మార్కెట్ల పతనానికి కారణమైంది. అయితే ఈ నష్టాల పరంపర... నూతన వ్యాపార విధానాలకు తగ్గట్టుగా మార్కెటు తనకుతాను సర్దుబాటు చేసుకోవడాన్ని సూచిస్తోంది.

ప్రభుత్వాన్నీ అర్థంచేసుకోవాలి!

ప్రభుత్వం ఓ నిర్దిష్ట పరిధిలో, అనేక రాజకీయ ఒత్తిళ్ల మధ్య పనిచేస్తుంటుందనేది వాస్తవం. అనేక రంగాలవారికి సేవ చేయాల్సిన అవసరం అంటుంది. మార్కెట్​ కూడా అందులో ఒకటని గుర్తుంచుకోవాలి.

వివేకవంతమైన పెట్టబడి మూలసిద్ధాంతాలు, సమగ్ర విశ్లేషణ, క్షేత్రస్థాయి వాస్తవికతలను అర్థం చేసుకోవాలి.

క్షేత్రస్థాయి వాస్తవాలు

అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సుమారు 300 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులపై 10 శాతం దిగుమతి విధిస్తామన్న ట్రంప్​ ప్రకటన సహా డిమాండ్​ తగ్గుదల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి.

మరోవైపు దేశీయ ఆర్థిక వృద్ధి మందగించింది. ప్రపంచ బ్యాంకు 2019-20 సంవత్సరానికి గాను భారత వృద్ధి అంచనాలు తగ్గించింది. రుణ సరఫరా తగ్గడం వల్ల వ్యాపార సంస్థల సెంటిమెంట్​ దెబ్బతింది. వీటన్నింటి కారణంగా విదేశీ నిధుల ఉపసంహరణలు కొనసాగుతున్నాయి. ఫలితంగా దేశీయ మార్కెట్లు నష్టాల పాలవుతున్నాయి.

ఏం చేయవచ్చు?

చైనా దిగుమతులపై సుంకాలు విధించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయం లాంటి అంశాలు.... భారత్​ పరిధిలో లేవు. కానీ... మార్కెట్లకు విశ్వాసాన్ని పెంచే చర్యలు తీసుకోవడం ద్వారా పరిస్థితిని మెరుగుపరచవచ్చు.

మొదటిగా మూలధన ప్రవాహాలను అడ్డుకోవాలి లేదా కనీసం వాటి ప్రవాహ వేగాన్ని తగ్గించడం అత్యవసరం. సరైన విధాన చర్యలు ప్రకటించడం ద్వారా పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించాలి.

ఈ చర్యలు సఫలమైతే ప్రజల వ్యక్తిగత ఆదాయం వృద్ధి చెందుతుంది. తద్వారా డిమాండ్ పుంజుకుంటుంది. మదుపర్లలో విశ్వాసం పెరుగుతుంది.
పెట్టుబడుల ఉపసంహరణ ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు దీర్ఘకాలిక చర్యలు అవసరం. అదే సమయంలో భారీ పెట్టుబడులను ఆకర్షించాలి. ఇందుకు కార్మిక ఉత్పాదకత, పాలన, మార్కెట్ పనితీరు, వ్యాపార వాతావరణ సంబంధిత సమస్యలు లాంటి సంస్థాగత సవాళ్లను పరిష్కరించాలి. ఇందుకు విధాన సంస్కరణలు ఎంతో కీలకం.

విధాన నిర్ణేతలు కొంచెం రాజకీయాలు తగ్గించి, ఆర్థిక రంగానికి ఊతమిచ్చే చర్యలు చేపట్టడానికి ఇదే సరైన సమయం.

(రచయిత -డాక్టర్​ మహేంద్ర బాబు కురువ, సహాయక ఆచార్యులు, హెచ్​ఎన్​బీ గర్వాల్​ కేంద్ర విశ్వవిద్యాలయం, ఉత్తరాఖండ్​)

ఇదీ చూడండి: ఎన్ని మొబైల్స్​ ఉన్నా... ఒకటే వాట్సాప్​ ఖాతా!

ABOUT THE AUTHOR

...view details