కరోనా వల్ల ప్రజల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడింది. ఫలితంగా చాలా మంది రుణాలు తీసుకున్నారు. సులభంగా పొందే వీలుండటం వల్ల బంగారంపై ఎక్కువ మంది రుణం తీసుకున్నారు. పసిడి ధరలు పెరగటంతో పాటు ఎల్‌టీవీ విలువను పెంచుకునేందుకు బ్యాంకులకు రిజర్వు బ్యాంకు అనుమతి ఇచ్చింది. దీని వల్ల క్రితం కంటే ఎక్కువ రుణం తీసుకునేందుకు వీలు కలిగింది.
అయితే ఇటీవల పసిడి ధరలు తగ్గుతున్నాయి. నెల రోజుల్లో 10 గ్రాముల బంగారం వెల దాదాపు రూ.5 వేల వరకు తగ్గింది. హైదరాబాద్‌లో అగస్టు మొదటి వారంలో రూ.58వేల వద్ద ఉన్న ధర.. ప్రస్తుతం రూ.53 వేలకు దిగింది.
చెల్లించాల్సి రావొచ్చు..
బంగారం ధర తగ్గినట్లైతే.. తీసుకున్న రుణంలో కొంత మొత్తం చెల్లించమని రుణమిచ్చిన సంస్థలు అడిగే అవకాశం ఉందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో రుణం ఇచ్చే సమయంలో చేసిన ఒప్పందం కూడా వీలు కల్పిస్తుందని వారు అంటున్నారు.
కొత్తగా రుణం తీసుకోవాలనుకునే వారికి మాత్రం అందే రుణం మొత్తం తగ్గుతుంది. ఇటీవల బ్యాంకుల్లో పసిడిపై ఇచ్చే రుణానికి సంబంధించి ఎల్‌టీవీ నిష్పత్తిని 75 శాతం నుంచి 90 శాతానికి పెంచింది రిజర్వు బ్యాంకు.
గోల్ట్ టూ వాల్యూ నిష్పత్తి..
బంగారంపై తీసుకున్న రుణానికి, బంగారం విలువకు మధ్యనున్న నిష్పత్తిని గోల్ట్ టూ వాల్యూ రేషియో(ఎల్‌టీవీ) అంటారు. బంగారం ధర తగ్గినట్లైతే ఎల్‌టీవీ పెరుగుతుంది. ఈ అంతరాన్ని పూడ్చేందుకు ధర తగ్గిన సందర్భంలో రుణానికి సంబంధించి కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించటం లేదా అదనంగా కొంత పసిడిని తాకట్టు పెట్టాలని వినియోగదారులను అడిగే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు.
పుత్తడి ధర తగ్గినప్పుడు.. వినియోగదారుడితో ఉన్న సంబంధాలు, రుణ గడువు పూర్తయ్యేందుకు ఉన్న కాలం తదితర అంశాలను కూడా రుణమిచ్చిన సంస్థలు పరిగణనలోకి తీసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు సరైన మార్జిన్లను నిర్వహించుకుంటాయని, దీని వల్ల సాధారణంగా ఇవి బంగారం విలువ తగ్గినప్పుడు తిరిగి చెల్లించాలని కోరటం, అదనంగా బంగారం కుదువ పెట్టాలని కోరటం లాంటివి చేయవని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విధంగా కోరే అధికారం మాత్రం రుణ ఒప్పందం ప్రకారం అవి కలిగి ఉంటాయని అంటున్నారు.
ముందస్తు జాగ్రత్తలతో..
సాధారణంగా ఎక్కువ ఎల్‌టీవి విలువతో రుణాలిచ్చినట్లైతే.. సంస్థలకు ఎక్కువ రిస్కు ఉంటుంది. అందుకే ఈ విషయంలో జాగ్రత్త పడుతాయి. బంగారం ధరను ఈ సంస్థలు గమనిస్తూ.. మార్జిన్లు, రిస్కును అంచనా వేసుకుంటుంటాయి. ధరలు తగ్గుతాయన్న అంచనా ఉన్నట్లయితే.. ఎల్‌టీవీ విలువ తగ్గించుకోవచ్చు.
కొత్తగా రుణం తీసుకోవాలనుకునే వారికి బంగారం ధరలు తగ్గటం వల్ల తక్కువ మొత్తం రుణం అందుతుంది. అంతేకాకుండా రుణం ఇచ్చే సంస్థ ఎల్‌టీవీని తగ్గించినట్లైతే కూడా రుణ మొత్తం మరింత తగ్గుతుంది.
ఇదీ చూడండి:బంగారంపై పెట్టుబడి పెట్టాలా? అయితే ఇది చదవాల్సిందే