పరిమితమైన రిస్కు, స్థిరమైన ప్రతిఫలం, మూలధన వృద్ధి.. ఇదీ స్టాక్ మార్కెట్‌లో మదుపు చేసే ప్రతిఒక్కరూ కోరుకునేది. అయితే, దీర్ఘకాలం వేచి చూడగలిగి.. ఓ వ్యూహం అనుసరిస్తే ఇది సాధ్యమే అని వారెన్ బఫెట్, పీటర్ లించ్ వంటి దిగ్గజ మదుపర్లు నిరూపించారు. మరి ఆ వ్యూహమేంటో తెలుసా?అదే వాల్యూ ఇన్వెస్టింగ్.
వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే..
ఏదైనా స్టాక్ దాని వాస్తవ విలువ కంటే తక్కువ ధరలో ట్రేడవుతుంటే గుర్తించి దాంట్లో మదుపు చేయడమే వాల్యూ ఇన్వెస్టింగ్. ఈ వ్యూహాన్ని అనుసరించాలంటే స్టాక్ మార్కెట్‌పై మంచి అవగాహన ఉండాలి. స్టాక్ అండర్‌వాల్యుయేషన్, ఓవర్‌వాల్యుయేషన్.. అనే రెండు అంశాలపైనే దీని అమలు ఆధారపడి ఉంటుంది. పేర్లు సూచిస్తున్నట్లు ఓ స్టాక్ దాని వాస్తవ ధర కంటే తక్కువకు ట్రేడైతే ‘అండర్‌వాల్యూడ్ స్టాక్’ అనీ.. ఎక్కువకు ‘ట్రేడైతే ఓవర్‌వాల్యూడ్’ అంటారు. షేరు ధరలు సాధారణంగా సదరు కంపెనీ దీర్ఘకాల ఆర్థిక ఫలితాలకు ప్రతిరూపంగా ఉండవని ఈ వ్యూహాన్ని అనసరించే మదుపర్లు విశ్వసిస్తారు.
వాల్యూ ఇన్వెస్టింగ్ ఎలా పనిచేస్తుంది?
స్టాక్ ధర వాస్తవ విలువ కంటే కింద ఉంటే దాన్ని కొనాలి. దాని ధర వాస్తవ విలువకు చేరువైనా.. లేదా కొంచెం పైకి ఎగబాకినా అమ్మేసి సొమ్ము చేసుకోవాలి. స్టాక్ ధర ఎందుకు పెరిగింది.. తగ్గింది.. అన్నది అంచనా వేయడం కొంచెం కష్టమే. మార్కెట్ సూచీలను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. సాధారణంగా స్టాక్ ధర మార్కెట్‌లోని ట్రెండ్, మదుపర్ల సైకాలజీని బట్టి మారుతుంటుంది. దీర్ఘకాలంలో మాత్రం ఆ కంపెనీ పునాదులే ఆ స్టాక్ ధరల్ని నిలబెడతాయి. దీని ఆధారంగానే వాల్యూ ఇన్వెస్టర్స్ మదుపు చేస్తారు.
ఉదాహరణకు.. 'ఏ' అనే కంపెనీ భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇవ్వనుందనే అంచనాలు ఉన్నాయనుకుందాం. ప్రస్తుతం రూ.100గా ఉన్న దాని స్టాక్ ధర రూ.120కి చేరింది. అయితే, మార్కెట్లోని ఇతర సానుకూల పవనాలు జతకావడం, మదుపర్లు ఆలోచనా తీరు వంటి కారణాలతో ఆ స్టాక్ ధరకు ప్రీమియం తోడై రూ.180కి చేరింది. ఈ సమయంలో వాల్యూ ఇన్వెస్టర్లైతే.. కంపెనీ ప్రాథమిక అంశాల్ని క్షుణ్నంగా అధ్యయనం చేస్తారు. స్టాక్ ఓవర్‌వాల్యూడ్ అని తెలిసిపోతుంది. ఇలాంటి స్టాక్స్‌కి చాలా దూరంగా ఉంటారు. దీర్ఘకాలంలో చక్కటి రాబడినివ్వగలిగే వ్యాపార పునాదులు ఉండి.. ప్రస్తుతం తక్కువ ధరకు ట్రేడ్ అవుతున్న కంపెనీల్లోనే మదుపు చేస్తారు.
వాస్తవ విలువను ఎలా కనుగొంటారు?