కరోనా మూలంగా.. సెకండ్ హ్యాండ్ కార్లకు బాగా డిమాండ్ పెరుగుతోంది. రుణం ద్వారా వాహనాలను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే కొత్త కారు కంటే వినియోగించిన కారు కొనుగోలు విషయంలో ఫినాన్సింగ్ కష్టమని నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా.. ప్రత్యామ్నాయ సదుపాయాలతో కారు సొంతం చేసుకునేందుకు పలు సూచలను ఇస్తున్నారు. అవేమిటో తెలుసుకుందామా!
కార్ల డిమాండ్‌కు కారణాలు..
ఇప్పటి వరకు ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రజారవాణాను ఉపయోగించే వారు. అయితే కరోనా వల్ల ప్రజా రవాణా తగ్గిపోయింది. కొవిడ్ భయాల వల్ల ఆటోలు, క్యాబ్‌లు ఎక్కేందుకు చాలా మంది భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు సొంత వాహనం కొనేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అందుకు భారీ మొత్తంలో కాకుండా.. బడ్జెట్ ధరలో కార్లు కొనేందుకు వినియోగదారులు ఇష్టపడుతున్నట్లు ఆటోమొబైల్ డీలర్లు చెబుతున్నారు. ఈ కారణంగా సెకండ్ హ్యండ్ కార్లకు డిమాండ్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఓఎల్ఎక్స్ సర్వే..
సెకండ్ హ్యాండ్ వస్తువుల విక్రయాల ప్లాట్‌ఫామ్ అయిన ఓఎల్ఎక్స్ ఈ అంశంపై ఏప్రిల్-జులై మధ్య ఓ సర్వే చేసింది. దీని ప్రకారం 54 శాతం మంది మూడు నుంచి ఆరు నెలల్లో వినియోగించిన కార్లను కొనేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కొత్త కార్ల మార్కెట్ కంటే సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ దాదాపు 1.2 రెట్లు పెద్దదని సర్వే అంచనా వేసింది.
రుణాలు కష్టం..
వినియోగించిన కార్ల కొనుగోలుకు రుణాలు లభించడం.. కొత్త కార్లతో పోలిస్తే కష్టమైన పనని చెబుతున్నారు నిపుణులు. సెకండ్ హ్యాండ్ కార్ల విషయంలో రిస్కు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమంటున్నారు. ఈ తరహా కార్ల కొనుగోలు విషయంలో.. ఫినాన్స్‌కు సంబంధించి బ్యాంక్‌లు మూడు నుంచి ఏడు శాతం ఎక్కువ వడ్డీని తీసుకుంటాయని వివరిస్తున్నారు.
ఫినాన్సింగ్కు రిస్క్..
పాత కార్ల కండీషన్‌ను అంచనా వేయడం అంత సులువైన పనేం కాదు. అంతేకాకుండా గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా? సర్వీసింగ్ చరిత్ర కూడా తెలుసుకోవటం కష్టం.
ఒకవేళ రుణ గ్రహీత.. అప్పు తిరిగి చెల్లించకుంటే.. కారును వేలం వేస్తాయి బ్యాంకులు, ఫినాన్స్ కంపెనీలు. అయితే పాత కార్లను వేలంలో విక్రయిస్తే తక్కువ మొత్తానికి అమ్ముడవుతుంటాయి కాబట్టి.. రుణాన్ని పూర్తిగా రికవరీ చేసుకోవడం కష్టమవుతుంది. ఈ అంశాలన్నింటి కారణంగా బ్యాంకులు, ఫినాన్సింగ్ కంపెనీలు పాత కార్లకు రుణాలు ఇచ్చేందుకు అంతగా ఆసక్తి చూపవని విశ్లేషకులు అంటున్నారు.