Union budget 2022-23: దేశ ఆరోగ్య సంరక్షణ రంగంలోని డొల్లతనాన్ని కొవిడ్ మహమ్మారి బహిర్గతం చేసింది. ముఖ్యంగా కరోనా రెండో దశలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత, ఐసీయూ పడకల కొరత.. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడాల్సిన అవసరాన్ని తెలియజేశాయి. గతేడాది బడ్జెట్‌లో వ్యాక్సిన్లకు కేటాయింపులు జరిపినప్పటికీ.. మొత్తంగా ఆరోగ్య రంగానికి పెంచింది అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో ఈసారైనా ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెంచాలని ఫార్మా పరిశ్రమ, ఆరోగ్య రంగ నిపుణులు కోరుతున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వైద్యశాస్త్రంలో పరిశోధనలు, నవకల్పనలకు పెట్టుబడులు తీసుకువచ్చేలా బడ్జెట్ ప్రసంగం ఉండాలని ఫిక్కీ హెల్త్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ అలోక్ రాయ్ సూచించారు.
బడ్జెట్‌పై నిపుణుల సూచనలు..
- ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా నిధులు కేటాయించాలి. ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో జీడీపీలో కనీసం రెండున్నర శాతం కేటాయింపులు జరపాలి.
- పన్ను ప్రయోజనాలు, ట్యాక్స్ హాలిడేల రూపంలో లేదా హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రజారోగ్యవ్యవస్థకు ప్రోత్సాహం అందించాలి.
- టైర్ 2, టైర్3 నగరాల్లో సబ్సిడీ రుణాల ద్వారా ఆరోగ్య సంరక్షణ రంగానికి ఊతమివ్వాలి.
- ఆరోగ్య రంగానికి ప్రస్తుతం బడ్జెట్‌లో జీడీపీలో 1.8 శాతం మాత్రమే కేటాయింపులు జరుపుతున్నారు. ఆ మొత్తాన్ని 2.5 నుంచి 3 శాతానికి పెంచాలి
- పరిశోధన, అభివృద్ధి విభాగానికి బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు ఉండాలి.
- కొన్ని ఔషధాలపై ఇప్పుడిస్తున్న కస్టమ్స్ డ్యూటీ రాయితీని కొనసాగించాలి.
- కొన్ని అరుదైన వ్యాధులను నయం చేసేందుకు వాడే ఔషధాలకు దిగుమతి సుంకాల నుంచి మినహాయింపు ఇవ్వాలి.
- ఫార్మా రంగంలో సులభతర వాణిజ్య విధానాలను అవలంబించాలి. అప్పుడే రోగుల అవసరాలను తీర్చే స్థాయిలో భారత ఫార్మా రంగం సన్నద్ధం కాగలదు.
- టెలీమెడిసిన్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలను వృద్ధి చేయాల్సిన అవసరాన్ని కొవిడ్ మహమ్మారి తెలియజెప్పింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో సైతం డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఆక్సిజన్ పడకలు, ఐసీయూలు, ఆక్సిజన్ ప్లాంట్లు కలిగిన ఆస్పత్రులు నెలకొల్పాల్సిన అవసరం ఉంది.