ఎట్టకేలకు భారత్‌లో రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి(Resident Grievance Officer)ని నియమించింది సామాజిక మాధ్యమం ట్విట్టర్(Twitter). ఆర్‌జీఓగా వినయ్ ప్రకాశ్‌ను నియమించినట్లు సంస్థ వెబ్సైట్లో తెలిపింది. అందులోని ఈమెయిల్ ఐడీకి వినియోగదారులు తమ ఫిర్యాదులను పంపించవచ్చని పేర్కొంది.
కొన్నాళ్లుగా నూతన ఐటీ నిబంధనల(new IT rules) విషయమై కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. ఐటీ నిబంధనలు పాటించడంలో ట్విట్టర్ విఫలమైందని ఇటీవల దిల్లీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ట్విట్టర్ తీరుపై దిల్లీ హైకోర్టుకూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు అధికారుల నియామకంలో జాప్యం తగదని హెచ్చరించిన కోర్టు.. ఇంకెంత కాలం పడుతుందని ప్రశ్నించింది. అందుకు ఇటీవలే 8 వారాల గడువు కోరిన ట్విట్టర్.. ఆ లోపే ఆర్జీఓను నియమించింది.
నూతన ఐటీ చట్టం ప్రకారం 50లక్షల యూజర్లు దాటిన సామాజిక మాధ్యామాలు తప్పనిసరిగా ముగ్గురు అధికారులను (ఆర్జీఓ, చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్, నోడల్ అధికారి) నియమించుకోవాలి. వారందరూ భారత్‌లో నివసిస్తూ ఉండాలి. కాగా, 1.75 కోట్ల మేర వినియోగదారులున్న ట్విట్టర్ నిబంధనలు పాటించని కారణంగా గత నెల మధ్యవర్తిత్వ హోదాను కోల్పోయింది.