కరోనా వైరస్‌పై సామాజిక మాధ్యమ, టెక్ దిగ్గజాలు పోరుకు సిద్ధమయ్యాయి. ఇందుకోసం ఫేస్‌బుక్, గూగుల్, లింక్డ్‌ఇన్, మైక్రోసాఫ్ట్, రెడిట్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి దిగ్గజాలు ఒక తాటిపైకి వచ్చాయి. ఆయా సంస్థల ప్లాట్‌ఫామ్‌లలో జరిగే తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఆ కంపెనీలు.. తామంతా కలిసి పనిచేయనున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
"మేము లక్షల మంది ప్రజలతో నిరంతరం అనుసంధానమై సాయం చేస్తుంటాం. ఈ క్రమంలో కరోనావైరస్‌పై జరిగే తప్పుడు సమాచారం, వదంతులపై సంయుక్తంగా పోరాటం చేస్తాం. అత్యుత్తమ సమాచారాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తాం. కీలకమార్పులను ప్రజలకు తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, ఆరోగ్య విభాగాలతో సమన్వయంగా ఉంటాం. మిగిలిన కంపెనీలు కూడా మాతో చేతులు కలిపి ప్రజలను ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండేలా చూడాలని కోరుతున్నాం" అని కంపెనీలు పేర్కొన్నాయి.