'అమెరికాలోనే తయారైన' ఔషధాలను, వైద్య పరికరాలను మాత్రమే కొనుగోలు చేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ నెల మొదటి వారంలో జారీ చేసిన 'ఎగ్జిక్యూటివ్ ఆర్డర్' మన దేశంలోని ఔషధ పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనివల్ల దేశీయ పరిశ్రమకు కొంత నష్టం తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నియంత్రిత (రెగ్యులేటెడ్) మార్కెట్లలో అమెరికా అతిపెద్దది కావటం, అమెరికా మార్కెట్‌పై మనదేశానికి చెందిన ఫార్మా అధికంగా ఆధారపడి ఉండటం దీనికి ప్రధాన కారణం. అందువల్ల దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి- అనే దిశగా అటు పరిశ్రమ, ఇటు ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేపట్టాయి. ‘ట్రంప్’ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం అమెరికా ఫెడరల్ ప్రభుత్వం అత్యవసర ఔషధాలను ఆ దేశంలోని కంపెనీల నుంచే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఇదీ అమెరికా మార్కెట్
- మన దేశానికి చెందిన ఫార్మా కంపెనీలు ఎన్నో ఏళ్లుగా అమెరికాకు జనరిక్ ఔషధాలు అందిస్తున్నాయి. మన ఔషధ ఎగుమతుల్లో ఉత్తర అమెరికా మార్కెట్ వాటా 35% వరకూ ఉంటుంది.
- అమెరికా అతి పెద్ద ఔషధ మార్కెట్. 2019 యూఎస్‌లో ఔషధ అమ్మకాలు 510 బిలియన్ డాలర్ల మేరకు నమోదయ్యాయి. ఇందులో జనరిక్ ఔషధాల వాటా 69 బిలియన్ డాలర్లు. 2019-20లో అమెరికాకు మనదేశం 6.74 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలు ఎగుమతి చేసింది.
- అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతి పొందిన ఫార్మా యూనిట్లు యూఎస్ వెలుపల అత్యధికంగా మనదేశంలో ఉన్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి యూఎస్‌ఎఫ్‌డీఏ వద్ద మనదేశానికి చెందిన 664 ఫార్మా యూనిట్లు (బల్క్ ఔషధాలు, ఫార్ములేషన్లు) రిజిస్టర్ అయ్యాయి.
- దేశీయ కంపెనీలు యూఎస్‌లో అనుమతి కోసం దాఖలు చేసి డీఎంఎఫ్ (డ్రగ్ మాస్టర్ ఫైల్స్) దరఖాస్తులు 4,500 కంటే పైగానే ఉండటం గమనార్హం.
- గత అయిదేళ్ల కాలంలో యూఎస్‌ఎఫ్‌డీఏ జారీ చేసిన ‘మార్కెట్ ఆథరైజేషన్ల’లో 30 శాతం మనదేశానికే లభించాయి.
- ఈ ఏడాది ఏప్రిల్ నాటికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ మనదేశానికి చెందిన ఫార్మా కంపెనీలకు చెందిన 5,029 ఏఎన్‌డీఏ (అబ్రీవియేటెడ్ న్యూడ్రగ్ అప్లికేషన్) దరఖాస్తులకు అనుమతులను ఇచ్చింది.
- ఇలా ఏవిధంగా చూసినా, యూఎస్ ఔషధ మార్కెట్లో మనదేశానికి చెందిన ఫార్మా కంపెనీలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతుంది.
తక్కువ ధరే ఆకర్షణ