వాణిజ్య సంక్షిప్త సందేశాల (ఎస్‌ఎమ్‌ఎస్) కోసం సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనలు వినియోగదారులకు చుక్కలు చూపించాయి. ఓటీపీలు రాకపోవడంతో బ్యాంకు లావాదేవీలు, కొవిడ్ టీకాకు పేర్ల నమోదు వంటి అంశాల్లో అంతరాయం ఏర్పడింది. ఈ నిబంధనలను 7 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్ మంగళవారం తెలిపింది. ప్రధాన టెలికాం కంపెనీలు (టెల్కోలు) తమ ఎస్‌ఎమ్‌ఎస్ నమూనాలను రిజిస్టర్ చేసుకుని, వినియోగదార్లు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చూడాలని ట్రాయ్ సూచించింది.
ఇదీ జరిగింది
వాణిజ్య సందేశాల నియంత్రణకు ట్రాయ్ 2018లో రూపొందించిన కొత్త నిబంధనలు ఈనెల 8 నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం.. టెల్కోలు ప్రతి ఎస్‌ఎమ్‌ఎస్ లేదా ఓటీపీలను సదరు వినియోగదారుడికి పంపే ముందు రిజిస్టర్డ్ సంక్షిప్త సందేశంతో సరిపోల్చి.. ధ్రువీకరించాలి. టెల్కోలు ఈ నిబంధనలను పాటించడం కోసం బ్లాక్‌చైన్ సాంకేతికతను వినియోగించుకున్నాయి. ఇందులో రిజిస్టర్ అయిన ఐడీల నుంచి వచ్చిన సందేశాలను మాత్రమే ధ్రువీకరించుకుని, వినియోగదారుడికి పంపుతారు. మిగతా ఐడీల నుంచి వచ్చే సందేశాలను నిలిపివేస్తారు. కొత్తగా తీసుకొచ్చిన బ్లాక్‌చైన్ ప్లాట్‌ఫాం (డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ)పై రిజిస్టర్ చేసుకోకపోవడంతో దాదాపు 40 శాతం వరకు సందేశాలు సోమవారం నిలిచిపోయాయి. వినియోగదార్లకు అవి చేరకపోవడంతో ఆన్‌లైన్ టికెట్ బుకింగులు, ఆధార్ ధ్రువీకరణ, కొవిన్ రిజిస్ట్రేషన్లు, ఇతర ఓటీపీ సేవల విషయంలో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
పరస్పర ఆరోపణలు
సోమవారం నాటి పరిణామాలపై బ్యాంకులు, టెల్కోలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. చెల్లింపు సంస్థలు, ఇతర కంపెనీలు సరైన చర్యలు చేపట్టలేదని టెల్కోలు ఆరోపించాయి. నిబంధనల అమలులో టెల్కోలు ద్రోహపూరిత ప్రక్రియను అనుసరించాయని బ్యాంకులు, చెల్లింపు సంస్థలు ఆరోపించాయి.