ఐఐటీలో ఇంజినీరింగ్ సీటు సాధించాలనేది ఎంతో మంది విద్యార్థులు, వారి తల్లితండ్రుల కల. దీన్ని సాధించాలంటే జేఈఈ (ఉమ్మడి ప్రవేశ పరీక్ష) అనే పెద్ద అవరోధాన్ని అధిగమించాలి. ఇది ఎంతో కఠినమైన లక్ష్యం. మరి దీన్ని సాధించాలంటే ఏం చేయాలి. ఎలా తయారు కావాలి, అసలు కోచింగ్ విధానాల్లో, బోధనా పద్ధతుల్లో ఎటువంటి మార్పులు వస్తున్నాయి. కరోనా మహమ్మారి వల్ల బోధన 'ఆన్‌లైన్' బాట పట్టటం... వంటి పలు అంశాలను 'ఈనాడు' ఇంటర్వ్యూలో వివరించారు ప్రముఖ విద్యా సంస్థ అయిన ఫిట్జీ ఛైర్మన్ డి.కె. గోయెల్. విశేషాలు..
? ప్రపంచీకరణ, ప్రైవేటు రంగం విస్తరణ వల్ల బ్యాంకింగ్, మేనేజ్‌మెంట్, సీఏ, కంపెనీ సెక్రటరీ... తదితర విభాగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఇంజినీరింగ్ విద్యపై ఆసక్తి తగ్గటం లేదు. దీనికి కారణాలు ఏమిటి?
ఇంజినీరింగ్‌లో ఎప్పటికప్పుడు కొత్త విభాగాలు రూపుదిద్దుకుంటున్నాయి. అగ్రి ఇంజినీరింగ్, నానో ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, స్పేస్ ఇంజినీరింగ్... వంటివి. దీనికి తోడు జేఈఈ పరీక్షకు హాజరై ఐఐటీలోనో లేక ఎన్‌ఐటీలోనో సీటు సంపాదిస్తే కెరీర్ అత్యున్నతంగా ఉంటుందనే నమ్మకం విద్యార్థుల్లో, వారి తల్లితండ్రుల్లో ఉంది. ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచం కూడా విద్యార్థులను ఇంజినీరింగ్ వైపు ఆకర్షిస్తోంది. అదే సమయంలో ఇతర విభాగాల్లో ఉద్యోగాలు పెరుగుతున్నాయనేది కాదనలేని విషయం. ఒకసారి ఇంజినీరింగ్‌లో అడుగుపెడితే ఆకాశమే హద్దుగా పైకి రావచ్చు. భవిష్యత్తులో ఏమో గానీ... ఇప్పటికీ¨ ఇంజినీరింగ్‌కు తిరుగులేదు.
? మనదేశంలో ఇంజినీరింగ్ కాలేజీలు-పరిశ్రమల మధ్య సరైన అనుసంధానం లేదు. దీనివల్ల ఇంజినీరింగ్ పూర్తి చేసిన వచ్చిన వారిలో తగినంత నైపుణ్యం ఉండటం లేదని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి ఏమైనా పరిష్కారం ఉందా
ఎన్నో ఇంజినీరింగ్ కాలేజీల్లో చెబుతున్న సబ్జెక్టులు, బోధనా పద్ధతులు కాలం చెల్లినవి కావటమే ఈ సమస్యకు ప్రధాన కారణం. అందువల్ల విద్యార్థులు కాలేజీ పాఠాలతో సరిపుచ్చుకోకుండా సొంతంగా కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేయాలి. కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, ఆటోమేషన్... వంటి విభాగాలపై దృష్టి పెట్టాలి. అదే సమయంలో విద్యా సంస్థలు-పరిశ్రమలు కలిసి ప్రస్తుత అవసరాలకు అనువైన విద్యా విధానాన్ని, నైపుణ్యాలు పెంపొందించే కార్యక్రమాలను అమలు చేయాలి.
? ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి విద్యా సంస్థల్లో చేరాలని ఎంతోమంది విద్యార్థులు కలలు గంటారు. ఈ పరీక్షల్లో విజేతగా నిలవటం ఎలా?
'సక్సెస్ మంత్ర' ఏమిటంటే, ఎంతో ముందుగా మొదలు పెట్టటమే. 6/7 వ తరగతి నుంచే ఐఐటీ సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని తయారీ మొదలు పెట్టాలి. విద్యార్థులను ఈ తరహాలోనే మేం తయారు చేస్తాం. ఆరో తరగతి నుంచి విద్యార్థిని తీర్చిదిద్దే దేశ వ్యాప్త సంస్థ ఫిట్జీ. ఎన్‌టీఎస్‌ఈ, ఒలంపియాడ్స్, కేవీపీవై... వంటి పోటీ పరీక్షలకు హాజరై తన సత్తాను పరీక్షించుకునే అవకాశం కల్పిస్తాం. దీనివల్ల విద్యార్థిలో గట్టి పునాది పడుతుంది. తత్ఫలితంగా కఠిన పరీక్షలను ఎదుర్కొనగలుగుతారు. ఈ క్రమంలో మంచి బోధనా సంస్థను ఎంచుకోవటం కూడా ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
? ఇంజినీరింగ్ కోచింగ్ విభాగంలో ఎన్నో సంస్థలు వచ్చాయి. పోటీ పెరిగింది. దీన్ని తట్టుకొని మీరెలా ముందుకు సాగుతున్నారు
కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకు సాగటమే మేం చేస్తున్నది. లక్ష్యసాధన దిశగా విద్యార్థులను, వారి తల్లితండ్రులను తయారు చేస్తాం. వినూత్న బోధనా పద్ధతులను అనుసరిస్తాం. ఇతర సంస్థల విధానాలు ఎలా ఉన్నప్పటికీ ఫిట్జీ మాత్రం క్రమశిక్షణతో విద్యార్థులను తీర్చిదిద్దటంపైనే దృష్టి పెడుతుంది.
? పేద విద్యార్థులకు ఐఐటీ సీటు సంపాదించాలనే ఆశ ఉన్నా కోచింగ్ సంస్థల్లో చేరే స్థోమత ఉండదు. అటువంటి వారికోసం ఏమైనా చేస్తున్నారా