వృద్ధి దశలో ఉన్నా.. పతనం అవుతున్నా స్టాక్ మార్కెట్ ఎప్పుడూ మనకు పెట్టుబడి అవకాశాలను ఇస్తూనే ఉంటుంది. అయితే, ఆయా సందర్భాల్లో మదుపరులు తీసుకునే నిర్ణయాలే వారి లాభనష్టాలను ప్రభావితం చేస్తుంటాయి. ఏయే అంశాల్లో సాధారణంగా మదుపరులు పొరపాట్లు చేస్తుంటారు.. వాటిని అరికట్టడానికి ఏం చేయాలన్నది తెలుసుకోవడమే ముఖ్యం.
వదంతులు నమ్మి
మార్కెట్ వృద్ధి చెందుతున్నప్పుడు కొన్ని వదంతులు, చిట్కాలు మన దృష్టికి వస్తుంటాయి. వీటిని నమ్మి మదుపు చేయడం మంచిది కాదు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకొని, మీ కష్టార్జితాన్ని పెట్టుబడిగా మలచాలి.
ఇతరులను అనుసరిస్తే
మనకు తెలిసిన స్నేహితులు, బంధువులు చాలామంది మార్కెట్లో మదుపు చేస్తుంటారు. వారికి ఒకటో రెండో షేర్లు మంచి లాభాలను ఆర్జించి పెట్టవచ్చు. ఇలా వాళ్లకు కలిసి వచ్చిన షేర్లు మనకూ కలిసొస్తాయని చెప్పలేం. ఇతరులను అనుసరించి, మీకు తగని మదుపు నిర్ణయాలు తీసుకుంటే.. కొన్నిసార్లు ఇబ్బందులు తప్పకపోవచ్చు.
ట్రేడర్-ఇన్వెస్టర్
మంచి కంపెనీల షేర్లను కొని, దీర్ఘకాలం కొనసాగాలనే ఆలోచనతో (ఇన్వెస్టర్‌గా) ఉన్నారనుకుందాం.. కానీ, స్వల్ప లాభనష్టాలకు ట్రేడర్‌గా (వెంట వెంటనే క్రయవిక్రయాలు జరపడం) మారిపోయారనుకోండి.. లేదా ట్రేడర్‌గా ఒక కంపెనీ షేరు కొని, అధిక నష్టభయం ఉన్న కంపెనీల్లో ఇన్వెస్టర్‌గా మారడం.. ఈ రెండు సందర్భాల్లోనూ నష్టపోయే అవకాశం లేదా రాగల లాభాలను అందుకోకపోవడం జరగవచ్చు. కాబట్టి, స్పష్టతతో వ్యవహరించండి.
వ్యూహం-క్రమశిక్షణ
ట్రేడర్, ఇన్వెస్టర్ ఎవరైనా చక్కటి పెట్టుబడి వ్యూహాన్ని ఎంపిక చేసుకోవాలి. దాన్ని క్రమశిక్షణతో ఆచరించాలి. వ్యూహం లేనప్పుడు.. ఉన్నా ఆచరించనప్పుడు పెద్దగా ప్రయోజనం ఉండదనే చెప్పాలి. ట్రేడర్లు నష్టాన్ని తగ్గించుకోవడానికి స్టాప్ లాస్, లాభాలను రక్షించుకోవడానికి ట్రైలింగ్ స్టాప్‌లాస్‌లాంటి వ్యూహాలను ఎంపిక చేసుకోవాలి.
మొత్తం ఒకచోటే
పెట్టుబడులు ఎప్పుడూ వైవిధ్యంగా ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. పెట్టుబడుల కోసం మీరు మార్కెట్‌కు తీసుకొచ్చే మొత్తాన్ని ఒకే కంపెనీలో లేదా ఒకే రంగంలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. కొంతమేర వైవిధ్యాన్ని పాటించేలా పలు రంగాల్లోని కొన్ని నాణ్యమైన షేర్లలో పెట్టుబడి పెట్టడం మేలు.