భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఎమ్టీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థలు దాదాపు రూ. 92 వేల కోట్ల మేర లైసెన్స్ ఫీజులు చెల్లించలేదని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎయిర్‌టెల్ రూ.21 వేల 682 కోట్లు, వొడాఫోన్ రూ.19వేల 823 కోట్లు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ.16 వేల 456 కోట్లు, బీఎస్ఎన్ఎల్ రూ.2 వేల 98 కోట్లు, ఎమ్టీఎన్ఎల్ రూ.2 వేల 537కోట్ల మేర చెల్లించాల్సి ఉందని టెలికాం విభాగం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో వెల్లడించింది.
నూతన టెలికాం విధానం ప్రకారం.. టెలికాం సంస్థలు తమ ఆదాయం నుంచి వార్షిక లైసెన్స్ రుసుము కింద కొంత మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. తమకు కేటాయించిన రేడియో ఫ్రీక్వెన్సీని వినియోగించుకున్నందుకు టెలిఫోన్ ఆపరేటర్లూ ప్రభుత్వానికి రుసుము చెల్లించాలి.