Tech Intensity To Improve Productivity: సాంకేతిక సమృద్ధితో కంపెనీలు ఉత్పాదకతను పెంచుకోవచ్చని, అందుబాటు ధరలో ఉత్పత్తులు, సేవలను తీసుకు రావొచ్చని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల వివరించారు. 'కొవిడ్ పరిణామాల వల్ల అంతర్జాతీయంగా అన్ని కంపెనీలూ డిజిటల్‌కు మారుతున్నాయి. హైబ్రిడ్ వర్క్, హైపర్ కనెక్టెడ్ వ్యాపారం, మల్టీ-క్లౌడ్ వాతావరణాలకు పరిధులు లేని డిజిటల్ వ్యవస్థ అవసరమ'ని ఆయన వివరించారు. సాంకేతిక సమృద్ధి (టెక్ ఇంటెన్సిటీ) అనే పదాన్ని గతంలో తొలిసారిగా ఉపయోగించింది నాదెళ్లే. డిజిటల్‌ను అందిపుచ్చుకోవడంతో పాటు డిజిటల్ సాంకేతికతను సొంతంగా అభివృద్ధి చేసుకోడాన్ని టెక్ ఇంటెన్సిటీగా ఆయన నిర్వచించారు. మంగళవారం జరిగిన 'మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ రెడీ' సదస్సులో నాదెళ్ల మాట్లాడుతూ 'సంస్థలు ఈ మార్పును అందిపుచ్చుకోవడానికి, బలంగా మారడానికి మద్దతుగా నిలవడం మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలకు ఒక గొప్ప అవకాశమన్నారు.
బలంగా ఉంటేనే గెలుస్తాం..
ఏ రంగంలోనైనా గెలవాలంటే.. ముందుగా బలంగా (ఫిట్‌గా) ఉండాలని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పేర్కొన్నారు. టాటా గ్రూప్ తన మూలాలను బలోపేతం చేసుకుంటూ, కొత్త భవిష్యత్(డిజిటల్) వైపు తన కంపెనీలను నడిపిస్తోందని వివరించారు. 'మారథాన్ పరుగు నుంచి వ్యాపారాన్ని నేర్చుకోవచ్చు. దీర్ఘకాలం పాటు పరుగులు తీస్తేనే ప్రయోజనాలు అందుతాయి. అందుకు మనకు శక్తి ఉండాలి. నీకు శక్తి లేకుంటే.. గెలవలేవ'ని మంగళవారంమైక్రోసాఫ్ట్ వార్షిక సదస్సులో పేర్కొన్నారు. 'భవిష్యత్ వ్యాపారాలనూ టాటా గ్రూప్ సృష్టిస్తోంది. 150 ఏళ్లకు పైగా ఒక బలమైన వ్యవస్థను కలిగి ఉండడంతో, సమాజంలో మా గ్రూప్ వేళ్లూనుకోగలిగింది. రేసులో ఇతరుల వల్ల మనం ఏకాగ్రత కోల్పోకూడదు. పరుగు పూర్తి చేసే విషయం నీకు సంబంధించింది. ఇతరులది కాదు. అది నీ వైపు నుంచే చూడాల'ని ఉద్బోధించారు.