ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసస్ (టీసీఎస్) ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా నియామకాలు చేపట్టనుంది. సుమారు 40వేలకు పైగా ఉద్యోగులను కొత్తగా తీసుకోనుంది. ఈ మేరకు సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
ప్రైవేటు రంగంలో సుమారు 5 లక్షల మంది ఉద్యోగులతో అతిపెద్ద సంస్థగా ఉన్న టీసీఎస్..గతేడాది క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా 40 వేల మందిని నియమించుకుంది. అయితే ఈ ఏడాది కూడా అంతకంటే ఎక్కువ మందిని తీసుకునేందుకు చూస్తున్నట్లు ఆ సంస్థ హెచ్ఆర్ చీఫ్ మిలింద్ లక్కడ్ తెలిపారు.
ఈ నియామకాల మీద కరోనా ఆంక్షల ప్రభావం ఏమీ ఉండడం లేదని మిలింద్ చెప్పారు. గతేడాది కూడా ప్రవేశ పరీక్ష కోసం 3.60 లక్షల మంది ఫ్రెషర్లు వర్చువల్ విధానంలో హాజరయ్యారని పేర్కొన్నారు.