ఈ నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా స్థిరంగా పెరుగుతుండటం ప్రజలను ఆగ్రహానికి గురి చేస్తోంది. అందుకు రెండు కారణాలున్నాయి.
- ఒకటి అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 40 నుంచి 43 డాలర్ల మధ్యే ఉన్నప్పుడు ధరలు పెంచడం.
- రెండోది.. ఇప్పటికే కరోనా సంక్షోభం కారణంగా వ్యాపారాలు, ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో చమురు ధరలకు రెక్కలు రావడం.
దేశరాజధాని దిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలను గమనిస్తే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం విధించిన పన్నులు, సుంకాలు చమురు ధరల్లో మూడింట రెండొంతులు ఉంది. అందులో సింహభాగం కేంద్రానికే పన్ను రూపంలో వెళ్తోంది. దిల్లీలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలో 42 శాతం కేంద్రానికి పన్ను రూపంలో వెళ్తుండగా, రాష్ట్ర ప్రభుత్వానికి 23 శాతం వ్యాట్ రూపంలో సమకూరుతోంది.
చమురు సంస్థలే పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయని.. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని 'ఈటీవీ భారత్'తో ఓ సీనియర్ అధికారి చెప్పారు.
తొలిసారి..
ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం వంటి చమురు సంస్థలు 80 రోజుల విరామం అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలను ఈ నెల మొదటి నుంచి పెంచడం ప్రారంభించాయి. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ 8.7 పెరిగింది. డీజిల్ ధర పెట్రోల్‌ను అధిగమించి లీటరుకు రూ.10.63 మేర ఎగబాకింది. దేశరాజధానిలో డీజిల్ ధర పెట్రోల్ కంటే ఎక్కువ ఉండటం చరిత్రలో ఇదే తొలిసారి.