సూర్యోదయ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్(ఎస్‌ఎస్‌ఎఫ్‌బీ) సరికొత్త పొదుపు ఖాతా పథకాన్ని తీసుకొచ్చింది. సంపద వృద్ధితో పాటు బీమా రక్షణను కల్పించేలా ఈ ప్రత్యేక ఖాతా రూపొందించారు. దీనికి 'సూర్యోదయ హెల్త్ అండ్ వెల్‌నెస్ సేవింగ్స్ అకౌంట్'గా నామకరణం చేశారు.
ఈ ఖాతా తెరిచిన వారికి ఆకర్షణీయ వడ్డీరేట్లతో పాటు కుటుంబ సభ్యులకు ఉచిత బీమా, ఆరోగ్య సంరక్షణ, అపరిమిత ఏటీఎం లావాదేవీలు.. వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి.
అర్హతలు..
- భారతీయ పౌరులు.. వ్యక్తిగతంగా లేదా జాయింట్‌గా ఖాతాను తెరవొచ్చు.
- వయసు 18-65 మధ్య ఉండాలి
- ఖాతాలో రూ.3 లక్షల 'మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్(ఎంఏబీ)' మెయింటైన్ చేయాలి.
ప్రయోజనాలు..
- ఈ ఖాతా తెరిస్తే మీరు, మీ జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలు.. మొత్తం నలుగురు కుటుంబ సభ్యులకు కలిపి రూ.25 లక్షల టాప్అప్ ఆరోగ్య బీమా లభిస్తుంది. అయితే, ఇక్కడ రూ.5 లక్షలు డెడక్టబుల్ అని గుర్తించాలి. అంటే మీ వైద్య ఖర్చులు రూ.5 లక్షలు మించితే.. ఆపై మొత్తాన్ని మాత్రమే టాప్ అప్ ఆరోగ్య బీమా కింద క్లెయిం చేసుకోగలరు.
- నలుగురు కుటుంబ సభ్యులకు ఆరోగ్య సంరక్షణ. తొలి ఏడాది ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో రెండు సార్లు వైద్య నిపుణులతో ఫోన్/వీడియో కన్సల్టేషన్ ఉచితం.
- ఒక్కోటి రూ.500 విలువ చేసే నాలుగు ఔషధ ఓచర్లు. రెండు డెంటల్ కన్సల్టేషన్ ఓచర్లు. రెండు డైట్ ఫిట్ ఓచర్లు.
- మార్చి 31, 2022 వరకు ఎమర్జెన్సీ అంబులెన్స్ సేవలు.
- పొదుపుపై 6.25 శాతం వడ్డీ లభిస్తుంది. ఇది నెలనెలా ఖాతాలో జమవుతుంది.
- రూపే ప్లాటినం సెక్యూర్ చిప్ డెబిట్ కార్డు ఉచితం. రోజుకి రూ.1.5 లక్షల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. పీఓఎస్‌లలో రూ.3 లక్షలు విలువ చేసే లావాదేవీలు జరపవచ్చు. ఏ బ్యాంకుకు చెందిన ఏటీఎంలోనైనా అపరిమిత లావాదేవీలు చేయవచ్చు.
- రూ.2 లక్షల జీవిత బీమా. శాశ్వత అంగవైకల్యానికీ ఈ బీమా వర్తిస్తుంది.
ఇదీ చూడండి:చెక్కులు ఇచ్చే ముందు జరభద్రం- ఇలా చేయొద్దు..