వాహన, బ్యాంకింగ్, లోహ రంగాల షేర్ల కొనుగోళ్లకు మద్దతు లభించడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో ఇవాళ స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 125 పాయింట్లు లాభపడి 37 వేల 396 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 35 పాయింట్లు వృద్ధి చెంది 11 వేల 071 వద్ద ట్రేడవుతోంది.
మందగమనంలోని ఆర్థిక వ్యవస్థకు చేయూతనివ్వడానికి, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మూలధన పెట్టుబడులకు తోడ్పాటు అందిస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో మార్కెట్లు పుంజుకున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇవాళ దేశ స్థూల ఆర్థిక వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర సమాచారం విడుదల చేయనుంది.
లాభాల్లో..
ఐసీఐసీఐ బ్యాంకు, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంకు, వేదాంత, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ, ఎమ్ అండ్ ఎమ్, మారుతీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐఓసీ, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎస్బీఐ 2.43 శాతం మేర రాణిస్తున్నాయి.
నష్టాల్లో..
ఎస్ బ్యాంకు, భారతీ ఇన్ఫ్రాటెల్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంకు 2.72 శాతం మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి.