స్టాక్ మార్కెట్లు వరుసగా 2వ సెషన్లో నష్టాలు నమోదు చేశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 202 పాయింట్లు తగ్గి 41 వేల 258 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 61 పాయింట్లు నష్టపోయి 12 వేల 113 వద్ద ముగిసింది.
బ్యాంకింగ్, వాహన రంగ షేర్లు భారీగా నష్టపోయాయి.
ఇంట్రాడే సాగిందిలా...
ఉదయం 41 వేల 510 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్... లాభాల్లో దూసుకెళ్లింది. ఓ దశలో 41 వేల 702 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. అయితే... టెలికాం సంస్థలు ఏజీఆర్ బకాయిలు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. టెలికాం సంస్థలకు రుణాలు ఇచ్చిన బ్యాంకులపై ప్రతికూల ప్రభావం ఖాయమన్న అంచనాల మధ్య బ్యాంకింగ్ రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్ 41 వేల 183 పాయింట్ల కనిష్ఠస్థాయికి దిగజారింది. చివరకు 41 వేల 258 వద్ద స్థిరపడింది.