రహదారి ప్రమాదాలకు ప్రధాన కారణం అతి వేగమే. ఇందులో కార్లు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతుంటాయి. ఈ ప్రమాదాలకు చెక్ పెట్టే దిశగా కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నూతన మార్గదర్శకాలు తీసుకువచ్చింది.
ఇందులో భాగంగా జులై 1 తర్వాత వచ్చే కొత్త కార్లలో అతివేగాన్ని హెచ్చరించే నూతన వ్యవస్థను పొందుపరచనున్నట్లు కేంద్ర రవాణా శాఖ వెల్లడించింది.
"జులై 1 నుంచి భారత్‌లో అమ్ముడయ్యే కార్లు అతివేగాన్ని హెచ్చరించే వ్యవస్థతో రానున్నాయి."
- అభయ్ డమ్లే, సంయుక్త కార్యదర్శి, కేంద్ర రవాణా శాఖ
ఈ వ్యవస్థ ఎలా పని చేస్తుందంటే..?
నూతన వ్యవస్థతో నడిచే కార్లు గంటకు 80 కిలోమీటర్లకన్నా ఎక్కువ వేగంతో వెళ్తే.. ప్రతి 60 సెకన్లకు రెండు సార్లు బీప్ శబ్దం వచ్చి డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది.
కారు వేగం గంటకు 120 కిలోమీటర్లు దాటితే నిరంతరాయంగా బీప్ శబ్దం వస్తూ డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది.
కొన్ని గణాంకాల ప్రకారం ఏటా రోడ్డు ప్రమాదాల బారిన పడి లక్ష మంది మరణిస్తున్నారు. ఇందుకు చాలా వరకు అతి వేగమే కారణమని తేలింది.
జీపీఎస్‌తో రోడ్డు ప్రమాదాల గుర్తింపు
రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే జీపీఎస్ సహాయంతో ప్రమాద స్థలాన్ని గుర్తించేందుకు మరో వ్యవస్థను తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. వేర్వేరు సంస్థలు అందించే జీపీఎస్ సమాచారం ఆధారంగా ఈ సమీకృత రహదారి ప్రమాదాల నిర్వాహక వ్యవస్థ పనిచేయనుంది.