తెలంగాణ

telangana

ETV Bharat / business

వెండిపై పెట్టుబడికి ఇదే సరైన సమయమా? - వెండిపై పెట్టుబడులు

గత సంవత్సరం జీవన కాల గరిష్ఠాలను తాకిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుతున్నాయి. ఇదే సమయంలో వెండి ధరలు మాత్రం స్థిరంగా పెరుగుతున్నాయి. దీనితో చాలా మంది వెండిపై పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. మరి వెండిని ఉత్తమ పెట్టుబడిగా పరిగణించవచ్చా? వెండిపై పెట్టుబడుల్లో రిస్క్ ఏమిటి? అనే అంశాలను తెలుసుకుందాం..

silver prices increasing day by day in india can we buy it for future
పెరుగుతున్న వెండి… కొనుగోలు చేయవచ్చా?

By

Published : Apr 1, 2021, 1:00 PM IST

బంగారంపై రాబడి డీలా.. వెండితో ఆదాయం భళా.. ఇది గత కొంత కాలంగా నెలకొన్న పరిస్థితి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో బంగారం కంటే వెండి మంచి రాబడినిచ్చింది. 2020లో బంగారం ధర జీవన కాల గరిష్ఠాలను తాకి.. క్రమంగా తగ్గుతూ వస్తోంది. వెండి మాత్రం స్థిరంగా పెరుగుతూ వస్తోంది. గత సంవత్సరం చివరితో పోల్చితే వెండి 47 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

వెండి ఉపయోగాలు..

బంగారంతో పోల్చితే వెండి భిన్నమైన లోహం. బంగారాన్ని సంపదగా, నగల రూపంలో దాచుకుంటారు. వెండిని ఎక్కువగా పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగిస్తారు. ఇండస్ట్రీయల్ ప్యాబ్రికేషన్, తయారీ రంగంలోనూ ఉపయోగిస్తుంటారు. ఎలక్ట్రికల్ స్విచ్ఛులు, బ్యాటరీలు, నీటి ప్యూరిఫికేషన్ వ్యవస్థల్లో, కంప్యూటర్ మధర్ బోర్డుల్లో వెండిని వాడుతుంటారు. వెండికి ఉన్న యాంటీ బ్యాక్టీరియా గుణాల వల్ల దంతాల మెడిసిన్​కు సంబంధించిన పరిశ్రమలో విరివిగా ఉపయోగిస్తారు. సౌర పలకాల తయారీలో వెండి ప్రధాన పాత్ర పోషిస్తుంది.

బంగారం-వెండి నిష్పత్తి

వెండిని మంచి పెట్టుబడి సాధనంగా చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే పెట్టుబడుల విషయంలో వెండి ధరను మాత్రమే కాకుండా 'బంగారం-వెండి నిష్పత్తి'ని పరిగణించాలని సూచిస్తున్నారు.

ఔన్సు బంగారం కొనేందుకు కావాల్సిన వెండిని 'బంగారం-వెండి నిష్పత్తి'గా పరిగణిస్తారు. ఇప్పుడు వెండిపై పెట్టుబడికి ఈ నిష్పత్తి అనుకూలంగా ఉందంటున్నారు నిపుణులు. చారిత్రకంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ నిష్పత్తి తక్కువగా ఉందని వారు చెబుతున్నారు.

బంగారం-వెండి నిష్పత్తి పరంగా చూస్తే 4, 5 సంవత్సరాల కనిష్ఠంలో వెండి ట్రేడ్ అవుతోంది. కాబట్టి ఇంకా ధర పెరిగే అవకాశం ఉంది. బంగారంతో పోల్చితే వెండి ఇంకా మంచి ప్రదర్శన కనబరిచే అవకాశం ఉంటుంది. నిష్పత్తి కొన్ని సంవత్సరాలు బంగారం వైపు ఉంటుంది. కొన్ని సంవత్సరాలు వెండి వైపు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా రాగి లాంటి పారిశ్రామిక కమొడిటీలు మంచి ప్రదర్శన కనబరుస్తున్నాయి. దీని ప్రకారం బంగారం కంటే వెండి మంచి రాబడులు ఇచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

- సతీశ్​, జెన్ మనీ జాయింట్ డైరెక్టర్​

జాగ్రత్త అవసరం…

బంగారంతో పోల్చితే వెండిలో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. అంటే వెండిలో రిస్కు ఎక్కువగా ఉంటుంది. వెండిలో రిటర్న్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి పెట్టటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

వెండిని ఏ విధంగా కొనవచ్చు.

భౌతిక రూపంలోనే కాకుండా… ఎలక్ట్రానిక్ రూపంలో వెండిని కొనుగోలు చేయవచ్చు. స్టాక్ మార్కెట్లో షేర్ల మాదిరిగా మల్టీ కమోడిటీ ఎక్సేంజీ​ (ఎంసీఎక్స్) ద్వారా వెండి క్రయ విక్రయాలు జరపొచ్చు. సిల్వర్ ఎక్సేంజీ ట్రేడెడ్ ఫండ్లలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు.

భౌతికంగా అయితే.. బంగారంతో పోల్చితే వెండిని ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేయాల్సి ఉండటం వల్ల స్టోరేజ్ స్పేస్ ఎక్కువ కావాల్సి ఉంటుంది.

వెండిని కల్తీ చేయటం చాలా సులభం. కాబట్టి నగల దుకాణం నుంచి వెండి కొనుగోలు చేస్తున్నట్లయితే మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:పెట్టుబడుల్లో 'బంగారం'.. ఈ జాగ్రత్తలతో మంచి లాభాలు

బంగారంపై పెట్టుబడి పెట్టాలా? అయితే ఇది చదవాల్సిందే

కరోనా కాలంలో పసిడిపై పెట్టుబడులు కలిసొస్తాయా?

ABOUT THE AUTHOR

...view details