తెలంగాణ

telangana

By

Published : Apr 26, 2020, 3:52 PM IST

ETV Bharat / business

'మూడు వారాల్లో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి షురూ'

కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిపై కీలక ప్రకటన చేసింది సీరం ఔషధ సంస్థ. రాబోయే రెండు వారాల్లో వ్యాక్సిన్ తయారీని ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. ఆక్స్​ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి వ్యాక్సిన్ రూపకల్పనకు కృషి చేస్తున్న సంస్థ ఆ దిశగా సాధించిన పురోగతిని వివరించింది.

serum
రెండు వారాల్లో కరోనాపై 'సీరం' వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభం

కరోనా వైరస్​ను నియంత్రించేందుకు అవసరమైన వ్యాక్సిన్ తయారీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య పరిశోధనా సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇదే కోవలో భారత్​లో వ్యాక్సిన్ల తయారీకి పేరు గాంచిన సీరం ఇన్సిటిట్యూట్ ఆఫ్ ఇండియా టీకా తయారీపై కీలక ప్రకటన చేసింది. ఆక్స్​ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన టీకా ఉత్పత్తిని రాబోయే రెండు నుంచి మూడు వారాల్లో ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. మానవులపై టీకా పరిశీలన పూర్తయితే అక్టోబర్​ నాటికి మార్కెట్లోకి తీసుకువస్తామని వెల్లడించింది.

వ్యాక్సిన్ రూపకల్పన కోసం ప్రపంచవ్యాప్తంగా ఏడు సంస్థలు ఆక్స్​ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలసి పనిచేస్తున్నాయి. అందులో సీరం ఒకటి.

"కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం ఆక్స్​ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ హిల్​తో కలిసి మా బృందం పనిచేస్తోంది. వ్యాక్సిన్ ఉత్పత్తిని రెండు నుంచి మూడు వారాల్లో ప్రారంభిస్తామని అంచనా వేస్తున్నాం. నెలకు 50 లక్షల చొప్పున వచ్చే 6 నెలల్లో వ్యాక్సిన్​లు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తర్వాతి కాలంలో నెలకు కోటి వ్యాక్సిన్​ల చొప్పున ఉత్పత్తి చేయగలమని భావిస్తున్నాం."

-ఆదర్ పూణావాలా, సీఈఓ, సీరం సంస్థ

వ్యాక్సిన్ పరిశోధన ఫలితాలను వివరించారు ఆదర్. మానవులపై ఫలితాలు సానుకూలంగా వస్తే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నాటికల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. రాబోయే రెండు నుంచి మూడు వారాల్లో మానవులపై వ్యాక్సిన్ పరిశీలన ప్రారంభం అవుతుందని చెప్పారు.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమ సామర్థ్యం, భాగస్వాముల సహకారంపై విశ్వాసంతో ఈ ప్రాజెక్టుకు నిధులు వెచ్చించినట్లు తెలిపింది సీరం సంస్థ. పుణెలోని ప్లాంట్​లో ఈ వైరస్ టీకాలను ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పింది. ఉత్పత్తిలో సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వ అధికారుల సాయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

అయితే ఈ వ్యాక్సిన్​కు పేటెంట్ హక్కులను కోరబోమని సంస్థ ప్రకటించింది. తమ ఫార్ములాను ఉపయోగించి ఎవరైనా వ్యాక్సిన్​లు తయారుచేసి.. అమ్మవచ్చని స్పష్టం చేసింది.

గతంలో మలేరియా వ్యాక్సిన్ ప్రాజెక్టులోనూ ఆక్స్​ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేసింది సీరం సంస్థ.

ఇదీ చూడండి:ఉల్లి సాయంతో లాక్​డౌన్​లో 1200 కి.మీ జర్నీ!

ABOUT THE AUTHOR

...view details