కొవిషీల్డ్ టీకా ధరను.. ముందుగా నిర్ణయించిన ధరతో పోలిస్తే 1.5 రెట్లు పెంచడాన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సమర్థించుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400, ప్రైవేటు వ్యక్తులకు రూ.600గా ఒక్క డోసు ధర నిర్ణయించడాన్ని వెనకేసుకొచ్చింది. కేంద్రానికి డోసుకు రూ.150 వసూలు చేసిన సీరం.. ఆ ధరను ముందస్తు ఫండింగ్ ఆధారంగా నిర్ణయించినట్లు పేర్కొంది. ఇప్పుడు పెట్టుబడిని గణనీయంగా పెంచాల్సి వచ్చిందని, మరిన్ని డోసుల కోసం సామర్థ్యాన్ని బలోపేతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించింది.
"వ్యాక్సిన్ అంతర్జాతీయ ధరలను భారత్లో అసంబద్ధంగా పోల్చి చూస్తున్నారు. కొవిషీల్డ్ టీకా ఇప్పటికీ మార్కెట్లో అందుబాటు ధరలోనే ఉంది. టీకా తయారు చేసుకోలేని దేశాలు అందించిన ముందస్తు ఫండింగ్ ఆధారంగా అంతర్జాతీయంగా టీకా ధరలు ప్రారంభంలో తక్కువగా ఉన్నాయి. భారత్ సహా ఇతర ప్రభుత్వాల కార్యక్రమాలకు సరఫరా ధర ప్రారంభంలో తక్కువగానే ఉంది. ప్రస్తుతం పరిస్థితి అస్థిరంగా ఉంది. వైరస్ మ్యూటేషన్లు పెరిగిపోతున్నాయి. దీని కోసం సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాల్సి ఉంటుంది."