ఒక నెట్‌వర్క్ నుంచి వేరే నెట్‌వర్క్‌కు కాల్స్ చేసినందుకు చెల్లించే ఇంటర్ యూసేజ్ ఛార్జీల (ఐయూసీ) విధానం రద్దుతో జియోపైనే కొంతమేర ప్రభావం పడనుందని తెలుస్తోంది. దీనివల్ల వొడాఫోన్ ఐడియా (వీఐ)కు లాభం చేకూరనుండగా.. ఎయిర్‌టెల్‌పై పెద్దగా ప్రభావం చూపబోదని ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ క్రెడిట్ సూయిజ్ అంచనా వేసింది.
టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) నిబంధనల ప్రకారం ఐయూసీ విధానం జనవరి 1తో ముగిసింది. దీంతో ఇకపై తమ నెట్‌వర్క్ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్ పూర్తిగా ఉచితమని జియో ప్రకటించింది. అంతకుముందు వేరే నెట్‌వర్క్‌కు చేసే కాల్‌కు నిమిషానికి 6 పైసలు చొప్పున చెల్లించాల్సి వచ్చేది. అయితే, గత కొంతకాలంగా వీఐ సబ్‌స్క్రైబర్లను భారీగా కోల్పోగా.. జియో అదే స్థాయిలో పెంచుకుంది. దీంతో అతిపెద్ద ఇన్‌కమింగ్ కాల్ రిసీవర్ (నెట్ రిసీవర్)గా జియో అవతరించింది. వీఐ నెట్ పేయర్‌గా నిలిచింది.