గృహ రుణాలు తీసుకునే వారికి భారతీయ స్టేట్ బ్యాంక్ శుభవార్త తెలిపింది. వడ్డీ రేటుపై 30 బేసిస్ పాయింట్ల కోత విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ప్రాసెసింగ్ ఫీజును 100 శాతం మాఫీ చేయనున్నట్లు వెల్లడించింది.
నూతన గృహ రుణాలపై వడ్డీ రేటును సిబిల్ స్కోర్ ఆధారంగా నిర్ణయించనున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. రూ.30లక్షల వరకు రుణాలు తీసుకుంటే 6.80 శాతం నుంచి వడ్డీ ఉంటుందని, రూ.30లక్షలు దాటే గృహ రుణాలకు అది 6.95శాతంగా ఉంటుందని ప్రకటనలో తెలిపింది.
మహిళా వినియోగదారులకు వడ్డీ రేటుపై 5 బేసిస్ పాయింట్ల రాయితీ లభిస్తుందని ఎస్బీఐ పేర్కొంది. దేశంలో అతిపెద్ద బ్యాంకుగా ఉన్న తాము ఇళ్లు కొనాలకునే వారికి ఆకర్షణీయమైన ఆఫర్ అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.
దేశంలోని 8 మెట్రో నగరాల్లో రూ. 5 కోట్ల లోపు గృహ రుణాలకు 30 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రాయితీ అందుబాటులో ఉంటుందని ఎస్బీఐ వెల్లడించింది. వినియోగదారులు ఇంటి నుంచే యోనో యాప్ ద్వారా 5 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రాయితీ పొందవచ్చని తెలపింది. 2021, మార్చి వరకు ఈ ఆఫర్ ఉంటుందని చెప్పింది.
ఇదీ చూడండి: బీఎస్ఈ కంపెనీల ఎం-క్యాప్ ఆల్‌టైం రికార్డ్