తెలంగాణ

telangana

ETV Bharat / business

SAS CROWN: హైదరాబాద్​లో 57 అంతస్తుల నివాస సముదాయం.. దక్షిణాదిలోనే ఎత్తైంది.! - 44 storeys building in hyderabad

హైదరాబాద్​ మహానగరం ఎత్తయిన టవర్ల నిర్మాణానికి కేరాఫ్​ అడ్రస్​ కానుంది. త్వరలో జీ+57 అంతస్తులతో ఆకాశాన్ని తాకేలా ఎత్తయిన నివాస సముదాయం నగరశివార్లలో ఏర్పాటు కానుంది. హైదరాబాద్​కు చెందిన సాస్​ ఇన్​ఫ్రా.. కోకాపేటలో 'క్రౌన్​(SAS CROWN)' పేరిట ఈ భవన సముదాయం నిర్మిస్తోంది. దక్షిణ భారతదేశంలోనే 50 అంతస్తులతో అగ్రస్థానంలో ఉన్న బెంగళూరును.. ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్​ అధిగమించనుంది.

57 storeys building
హైదరాబాద్​లో 57 అంతస్తుల బిల్డింగ్​

By

Published : Aug 20, 2021, 7:07 PM IST

Updated : Aug 20, 2021, 7:14 PM IST

హైదరాబాద్​లో త్వరలోనే జీ+ 57 అంతస్తులతో అత్యంత ఎత్తయిన నివాస సముదాయం ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులను ఆర్​ఈఆర్​ఏ(రియల్​ ఎస్టేట్​ రెగ్యులేటరీ అథారిటీ) మంజూరు చేసింది. నగరానికి చెందిన ప్రముఖ రియల్​ ఎస్టేట్​ సంస్థ సాస్ ఇన్​ఫ్రా.. కోకాపేటలో 4.5 ఎకరాల స్థలంలో 'క్రౌన్'(SAS CROWN)​ పేరిట ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేయనుంది. ​భవనం ఎత్తు 228 మీటర్లు కాగా ఒక్కో అంతస్తులో ఒక్క అపార్ట్​మెంట్​ మాత్రమే ఉంటుంది. మొత్తం ఐదు టవర్లలో ఈ ప్రాజెక్టును సాస్​ నిర్మిస్తోంది.

విలాసవంతంగా

ఒక్కో అపార్ట్​మెంట్​​ 6,565 చదరపు అడుగులు, 6,999 చదరపు అడుగులు, 8,811 చ.అ విస్తీర్ణాన్ని కలిగి ఉంటాయి. డూప్లెక్స్​ అపార్ట్​మెంట్ 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితం కానుంది. ఈ ప్రాజెక్టులో ఆధునిక హంగులతో స్విమ్మింగ్​ పూల్​ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 8,811 చ.అడుగుల ఫ్లాట్​కు రూ. 8.81 కోట్లు ధర నిర్ణయించినట్లు సాస్​ ఇన్​ఫ్రా ప్రతినిధి తెలిపారు. 6,565చ.అకు రూ.6.57 కోట్లు, 6,999 చ.అకు రూ. 7కోట్లు ధరగా నిర్ణయించారు. డూప్లెక్స్​ అపార్ట్​మెంట్​కు ఈ ధర రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.

సకల హంగులతో

ఇంకా ఈ భవన సముదాయంలో సమావేశాలకు, ఫంక్షన్లకు 69,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేకంగా మల్టీ ఫంక్షన్​హాల్​ను నిర్మించనున్నారు. వ్యాపార కార్యకలాపాలు, చిన్న పిల్లలు ఆడుకునేందుకు వీలుగా, వినోదం కోసం సకల హంగులతో లాంజ్​ను ఏర్పాటు చేయనున్నారు. 2027 వరకు ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని సాస్​ వెల్లడించింది.

జీ+ 44తో

నానక్​ రాం గూడలో ది ఒలింపిస్​ పేరిట 44 అంతస్తుల టవర్ల నమూనా చిత్రం

సుమధుర గ్రూపు, వాసవి గ్రూపు భాగస్వామ్యంతో 'ది ఒలింపస్'​ పేరిట గచ్చిబౌలి/నానక్​ రామ్​ గూడ ప్రాంతంలో 44 అంతస్తుల భవనానికి శ్రీకారం చుట్టింది. 5.16 ఎకరాల్లో పొడవైన రెండు టవర్లు నిర్మితం కానున్నాయి. 854 కుటుంబాలు నివాసం ఉండేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. ఈ ప్రాజెక్టుకు రూ. 1000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు సుమధుర గ్రూప్ ఛైర్మన్​ జి. మధుసూధన్​ తెలిపారు. 3బీహెచ్​కే, 3.5బీహెచ్​కే అపార్ట్​మెంట్లుగా 1670- 3000 చ.అల విస్తీర్ణంలో వినియోగదారులకు అందిస్తామని చెప్పారు. ప్రాజెక్టును 2025 డిసెంబరు కల్లా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. భవిష్యత్తులో 6 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపడతామని, అందులో 3 మిలియన్‌ల విస్తీర్ణం హైదరాబాద్‌లో, మరో 3 మిలియన్‌ల విస్తీర్ణంతో బెంగళూరులో నిర్మాణాలు చేపడతామని తెలిపారు. ఇందుకు రూ. 2వేల కోట్లు అవసరమని అంచనా వేస్తున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి:Kishan Reddy: ఎన్ని లక్షల కోట్లు ఖర్చైనా అందరికి టీకా ఇచ్చి తీరుతాం

Last Updated : Aug 20, 2021, 7:14 PM IST

ABOUT THE AUTHOR

...view details