2020లో దేశంలోని ఉద్యోగుల జీతాలు దాదాపు 9.2 శాతం పెరగనున్నట్లు కోర్న్ ఫెర్రీ గ్లోబల్ శాలరీ ఫోర్కాస్ట్ నివేదిక అంచనా వేసింది. అయితే ద్రవ్యోల్బణం ఈ పెరుగుదలపై ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. ద్రవ్యోల్బణం కారణంగా నికర పెరుగుదల కేవలం 5 శాతమే ఉండనున్నట్లు వెల్లడించింది. 130 దేశాల్లోని 25 వేల సంస్థల్లో పనిచేసే దాదాపు 2 కోట్ల మంది ఉద్యోగుల సమాచారాన్ని విశ్లేషించి నివేదిక రూపొందించింది కోర్న్ ఫెర్రీ.
"ప్రపంచ వ్యాప్తంగా వాస్తవ వేతనంలో తగ్గుదల నమోదైనా భారత్ స్థిరమైన వేతన వృద్ధి సాధించింది. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, ఆర్థిక వ్యవస్థ తీరు గమనిస్తే వేతనాల పెరుగుదల కొనసాగే అవకాశం ఉండొచ్చని భారత మార్కెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి."-నవ్నీత్ సింగ్, ఛైర్మన్, కోర్న్ ఫెర్రీ ఇండియా.
కోర్న్ ఫెర్రీ గ్లోబల్ శాలరీ ఫోర్కాస్ట్ అంచనా ప్రకారం గతేడాది (10శాతం)తో పోలిస్తే దేశంలోని ఉద్యోగుల సగటు వేతనాలు పెరుగుదల తగ్గుముఖం పట్టనున్నట్లు పేర్కొంది. అయినప్పటికీ ఆసియా దేశాలలో భారత్లోనే అధిక వేతన పెరుగుదల నమోదు కానున్నట్లు స్పష్టం చేసింది. వాస్తవ వేతనంలో పెరుగుదల ప్రపంచంలో భారతదేశంలోనే అధికం కావడం గమనార్హం.