అత్యవసర సమయాల్లో డిజిటల్ కంటెంట్‌ను నిరోధించే అధికరణ.. కొత్త మార్గదర్శకాల్లో ప్రత్యేకంగా తీసుకురాలేదని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ(ఐబీ) స్పష్టం చేసింది. ఈ నియమం 2009 నుంచే ఉందని పేర్కొంది. మార్గదర్శకాల్లో ఉన్న పార్ట్ III రూల్ 16 కింద ఎమర్జెన్సీ సమయంలో కొంతకాలం పాటు ఇంటర్నెట్ కంటెంట్‌ను బ్లాక్ చేసే అధికారం ఐబీ కార్యదర్శికి ఉంటుందని తెలిపింది.
"ఇంటర్నెట్ కంటెంట్‌ను అత్యవసర సమయాల్లో బ్లాక్ చేసే అధికారం కొత్త మార్గదర్శకాల ద్వారా వచ్చింది కాదు. ఇది 11 ఏళ్లుగా ఉంది. ఈ అధికరణ ప్రకారం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎమర్జెన్సీ కాలంలో డిజిటల్ కంటెంట్‌ను నిరోధించవచ్చు. వాటికి సంబంధించిన నియమావళి 2009 లోనే విడుదల అయ్యింది. కొత్తగా తీసుకొచ్చింది కాదు. ఇందుకు సంబంధించినవి కొత్తగా జత చేయలేదు."