తెలంగాణ

telangana

ETV Bharat / business

దేశీయ దిగుబడి పెంచితేనే నూనె ధరలు దిగొచ్చేది! - వంట నూనెల ఉత్పత్తి పెంపు

దేశంలో వంట నూనెల ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆకాశాన్నంటుతున్న ధరలతో సామాన్యుడు వంట చేసుకోలేని పరిస్థితి. 70శాతం దిగుమతులపైనే ఆధారపడటం వంటి అంతర్జాతీయ కారణాలు వంటనూనెల ధరలకు రెక్కలు వచ్చేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ దిగుబడిని ప్రోత్సహించడం ద్వారా సమస్యకు పరిష్కారం చూపవచ్చంటున్నారు నిపుణులు.

rising edible oil prices in india increasing in production would reduce the negative impact
దిగుబడి పెంచితేనే నూనెలు చల్లబడతాయి

By

Published : Feb 13, 2021, 3:44 PM IST

నూనెల ధరలు మరుగుతున్నాయి. అధిక ధరలతో వినియోగదారుల చేతి చమురు వదులుతోంది. ధరలు మళ్ళీ ఎందుకు పెరుగుతున్నాయి. నూనెల విపణిలో ఏం జరుగుతోంది? ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. దేశీయ దిగుబడి పెరగడం లేదు. పైగా వాడకం అధికమైంది. ధరలు మరింతగా పెరగకుండా అదుపు చేసేందుకు.. దేశం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకొని దేశీయంగా నూనెగింజల పంటలను ప్రోత్సహించాలని, లేదంటే పరిస్థితి మరింత విషమిస్తుందని వ్యవసాయ ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. వేరుసెనగ, సోయా, పొద్దుతిరుగుడు, పామాయిల్​.. ఒకటేమిటి అన్ని రకాల నూనెల ధరలూ గడచిన ఆరు నెలల్లో గణనీయంగా పెరిగాయి. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఈ పరిస్థితి నెలకొంది.. ఒక అంచనా ప్రకారం, గత సెప్టెంబరు నుంచి ఇప్పటి వరకు వీటి ధరలు 40 నుంచి 50 శాతం వరకూ పెరిగాయి. మరీ ముఖ్యంగా గత నెల్లో ఈ విజృంభణ మరీ ఎక్కువగా ఉంది. ఒక్కనెల్లోనే 15 శాతం పెరిగాయి.

అంతర్జాతీయ అంశాలు

భారత్ తనకు అవసరమైన వంటనూనెలను 70 శాతం వరకు విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. మలేసియా, ఇండోనేసియా వంటి ఆగ్నేయ ఆసియా దేశాలు నూనెల ప్రధాన సరఫరాదారులు. కేవలం ఆహార ఉత్పత్తుల కోసమే కాకుండా సౌందర్యసాధనాలు, బయోగ్యాసు పరిశ్రమల్లోనూ నూనెలను విరివిగా వినియోగిస్తారు. ఉత్పాదక దేశాలు ఎగుమతి సుంకాలు పెంచడం, ప్రధాన వాడకం దారులైన చైనా వంటి దేశాల్లో గిరాకి భారీగా పుంజుకోవడం.. ఈ అంశాలు గత ఆర్నెలల్లో ధరల విజృంభణకు దారితీసిన ముఖ్యకారణాలు. వీటికి కోవిడ్-19 తోడైంది. సరిగ్గా పంటలు కోతకు వచ్చిన తరుణంలో.. ఉత్పత్తి దేశాల్లో మహమ్మారి వ్యాప్తి తీవ్రం కావడంతో కూలీలు దొరకలేదు. ఫలితంగా విపణిలోకి కొత్త సరుకు రావడం ఆలస్యమై, అంతర్జాతీయంగా నూనెల సరఫరా గొలుసులో ఆటంకాలు ఏర్పడ్డాయి.

దేశీయ కారణాలు..

దేశీయంగా చూసినట్లయితే.. ఈ పంటల సాగు క్రమంగా క్షీణిస్తోంది. సాగు వ్యయాలు ఎక్కువగా ఉండటం, మరోవంక దిగుబడులు తక్కువగా ఉండటం.. వంటనూనెల విపణిని దెబ్బతీస్తోంది. ''దేశంలో అన్ని నూనె గింజలూ భారీగా పండుతాయి. అయితే వచ్చిన చిక్కల్లా దిగుమతి ధరల కంటే దేశీయ ఉత్పత్తి వ్యయాలు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో ధరల అదుపు కోసం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది'' అని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) సలహాదారు, వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ పరశ్‌రామ్ పాటిల్ అంటున్నారు. ''సాగు వ్యయం ఎక్కువగా ఉండటం ఒక్కటే కాదు, భారత్‌లో నూనె గింజల ఉత్పాదకత కూడా బాగా తక్కువ. సోయాబీన్‌ను ఉదాహరణగా తీసుకుందాం.. ఈ పంట ప్రపంచ సగటు దిగుబడి హెక్టారుకు 2.41 టన్నులు కాగా భారత్‌లో 1.13 టన్నులే'' అని ఆయన వివరించారు. వేరుసెనగదీ ఇదే పరిస్థితి. అమెరికాలో హెక్టారుకు 3.8 టన్నులు పండిస్తుండగా, భారత్‌లో దిగుబడి 1.21 టన్నులకు మించడం లేదని పరశ్‌రామ్ పాటిల్ చెప్పారు.

త్రిసూత్ర ప్రణాళిక..

డాక్టర్ పాటిల్ అభిప్రాయం ప్రకారం, దేశీయంగా నూనె గింజల ఉత్పత్తిని పెంచాలంటే ప్రభుత్వం ఇందుకు మూడంచెల వ్యూహం అవలంబించాలి. దురదృష్టం ఏమిటంటే అధిక దిగుబడి నూనెగింజల వంగడాలను అభివృద్ధి చేయడంలో భారత్‌లో తగినంత పరిశోధన జరగడం లేదు. ప్రభుత్వం ఈ అంశంపై ప్రాధాన్య ప్రాతిపదికన తగు చర్యలు తీసుకోవాలి. రెండో చర్యగా, నూనె గింజలను సబ్సిడీ ధరలకు పంపిణీ చేయాలి. చివరగా.. రైతులు ఈ పంటలు అధికంగా పండించేందుకు వీలుగా కనీస మద్దతు ధరలు పెంచితీరాలి.

ఇదీ చదవండి:వరుసగా ఐదో రోజు పెరిగిన పెట్రోల్​ ధరలు

విపణిలోకి 10 కోట్ల స్మార్ట్​ ఫోన్లు

డిసెంబర్​లో పెరిగిన పారిశ్రామిక ఉత్పత్తి

ABOUT THE AUTHOR

...view details