తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రవాసుల నుంచి భారత్​కు ఇక డబ్బు రావడం కష్టమే!

వలసదారులు ఈ ఏడాది తమ స్వదేశాలకు పంపే నగదు 20 శాతం మేర తగ్గుతుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. అలాగే గతేడాది భారత్​కు 88 బిలియన్ల డాలర్లు రాగా... ఈ ఏడాది 23 శాతం క్షీణతతో ఆ మొత్తం 64 బిలియన్ డాలర్లకు పడిపోతుందని పేర్కొంది. కరోనా సంక్షోభం, ప్రపంచ ఆర్థిక మందగమనమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.

Remittances to India likely to decline by 23 pc in 2020 due to COVID-19: World Bank
కరోనా సంక్షోభం: 20 శాతం పడిపోనున్న ప్రపంచ చెల్లింపులు

By

Published : Apr 23, 2020, 10:16 AM IST

తక్కువ, మధ్య స్థాయి ఆదాయ దేశాల నుంచి వలస వెళ్లినవారు... ఈ ఏడాది తమ స్వదేశాలకు పంపే నగదు 20 శాతం మేర తగ్గుతుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. అలాగే ప్రవాస భారతీయులు మన దేశానికి పంపే నగదు కూడా 23 శాతం క్షీణించి 64 బిలియన్ డాలర్లకు పరిమితమవుతుందని పేర్కొంది. గతేడాది ఈ ఆదాయం 88 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం. కరోనా విజృంభణ, ప్రపంచ ఆర్థిక మందగమనమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది ప్రపంచ బ్యాంకు.

కరోనా సంక్షోభం...

కరోనా మహమ్మారి విజృంభణతో షట్​డౌన్​లోకి వెళ్లిపోయిన పేద దేశాలు ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. సంపన్న దేశాలకు వలసవెళ్లిన వారిలో కొందరు ఉద్యోగాలు కోల్పోగా... మరికొందరికి పని గంటలు, వేతనాలు తగ్గాయి. ఫలితంగా ఈసారి వారు స్వదేశాలకు పంపే నగదు భారీగా తగ్గింది.

నిజానికి దక్షిణాసియా నుంచి లాటిన్ అమెరికా వరకు అన్ని దేశాలు కరోనా ధాటికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. ఫలితంగా విదేశాలకు వెళ్లిన వారు తమ రోజువారీ ప్రాథమిక ఖర్చులకు కూడా అడుగడుగునా ఆటంకాలు ఎదుర్కొంటున్నారు.

భారత అంతర్గత వలసదారులకు మరీ కష్టం

భారత్​ లాక్​డౌన్ వల్ల... ఉపాధి కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వెళ్లినవారు తీవ్రంగా ప్రభావితమవుతారని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. సుమారు నాలుగు కోట్ల మంది అంతర్గత వలసదారులు ఆర్థికంగా నష్టపోతారని అంచనా వేసింది.

ఏఏ దేశాలకు ఎంతెంత..

ఈ ఏడాది ఐరోపా, మధ్య ఆసియాలోని పేద దేశాలకు చేరే నగదు 27.5 శాతం తగ్గనుంది. అలాగే సబ్​-సహారన్​ ఆఫ్రికా దేశాలకు 23.1 శాతం, దక్షిణాసియాకు 22.1 శాతం, పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికాకు 19.6 శాతం, లాటిన్ అమెరికా, కరేబియన్​లకు 19.3 శాతం, తూర్పు ఆసియా, పసిఫిక్​ దేశాలకు​ 13 శాతం మేర నగదు ప్రవాహం తగ్గనుంది.

రికార్డు స్థాయిలో..

2019లో వలసదారులు విదేశాల నుంచి స్వదేశాలకు పంపించిన నగదు 554 బిలియన్ డాలర్లు. ఇది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కంటే చాలా ఎక్కువ. అనధికార మార్గాల్లో ద్వారా పంపించిన నగదును కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇది మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది అభివృద్ధి చెందుతున్న దేశాలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబుడులు 35 శాతానికి పడిపోతాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది.

కరోనా వల్ల తలెత్తుతున్న ఆర్థిక, ఆరోగ్య దుష్ప్రభావాల నుంచి వలసదారులను రక్షించడానికి ఆయా ప్రభుత్వాలు, సంస్థలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ బ్యాంకు సూచించింది.

ఇదీ చూడండి:పెను సంక్షోభం... అయినా కోలుకునే అవకాశం

For All Latest Updates

TAGGED:

World Bank

ABOUT THE AUTHOR

...view details