ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / business

Reliance Ind: 'అత్యంత విలువైన భారతీయ సంస్థ ఆర్‌ఐఎల్‌' - రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ విలువ

హురున్​ గ్లోబల్​ 500 కంపెనీల జాబితాలో.. ప్రభుత్వేతర కంపెనీల్లో భారత్‌ నుంచి అత్యధిక విలువైన కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్​ఐఎల్​)(Reliance industries) నిలిచింది. అంతర్జాతీయంగా మాత్రం గతేడాదితో పోలిస్తే 3 స్థానాలు కిందకు దిగింది.

mukesh ambani, ril, reliance industries
ముకేశ్​ అంబానీ, ఆర్​ఐఎల్​, రిలయన్స్​ ఇండస్ట్రీస్​
author img

By

Published : Aug 21, 2021, 5:42 AM IST

Updated : Aug 21, 2021, 8:56 AM IST

ప్రభుత్వేతర కంపెనీల్లో భారత్‌ నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌)(Reliance industries) అత్యధిక విలువైన కంపెనీగా తన స్థానాన్ని పదిలపర్చుకుంది. అంతర్జాతీయంగా మాత్రం గతేడాదితో పోలిస్తే 3 స్థానాలు కిందకు దిగింది. మార్కెట్‌ విలువను పరిగణనలోకి తీసుకుని, హురున్‌ గ్లోబల్‌ 500 కంపెనీల జాబితా రూపొందించింది. ఇందులో దేశీయ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీల స్థానాలు కూడా కూడా గతేడాదితో పోలిస్తే తగ్గాయి. జులై 15ను గడువుగా నిర్దేశించుకుని, కంపెనీలకు ఈ ర్యాంకులు ఇచ్చారు.

  • ముకేశ్‌ అంబానీ(Mukesh Ambani) నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ విలువ 11 శాతం పెరిగి 188 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.14.10 లక్షల కోట్లు) చేరింది. దేశీయంగా ప్రథమస్థానంలో కొనసాగిన ఈ సంస్థ, అంతర్జాతీయంగా 57వ స్థానంలో నిలిచింది.
  • 164 బి.డా.తో టీసీఎస్‌ ఒక స్థానం కోల్పోయి 74వ ర్యాంకు సాధించింది. 113 బి.డా.తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 19 స్థానాలు కోల్పోయి 124వ స్థానంలో నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ విలువ 36 శాతం పెరిగి 62 బి.డా.కు చేరడంతో 48 స్థానాలు మెరుగుపరచుకుని 268వ ర్యాంకు సాధించింది.
  • హెచ్‌డీఎఫ్‌సీ విలువ 1 శాతం అధికమై 56.7 బి.డాలర్లకు చేరినా, 52 స్థానాలు దిగజారి 310వ ర్యాంకుకు పరిమితమైంది.
  • కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ విలువ 8 శాతం తగ్గి 46.6 బి.డాలర్లుగా నమోదు కావడంతో 96 స్థానాలు దిగజారి 380వ ర్యాంకుతో సరిపెట్టుకుంది.
  • ఈ ఏడాది భారత్‌ నుంచి 3 కంపెనీలు.. విప్రో (457వ ర్యాంకు), ఏషియన్‌ పెయింట్స్‌ (477), హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ (498) ఈ జాబితాలో చోటు సంపాదించాయి.

"ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ కంపెనీల్లో 2/3 వంతు ఆర్థిక సేవలు, సాఫ్ట్‌వేర్‌ సేవలు అందించే కంపెనీలే. దేశంలో అంకురాల విప్లవం మొదలైనందున, వచ్చే కొన్నేళ్లలో మరిన్ని భారతీయ కంపెనీలు ఈ జాబితాలో చేరే అవకాశం ఉంద"ని హురున్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, ముఖ్య పరిశోధకులు అనాస్‌ రెహమాన్‌ వెల్లడించారు.

అంతర్జాతీయంగా యాపిల్‌

  • ప్రపంచంలో అత్యధిక విలువైన కంపెనీగా యాపిల్‌ నిలిచింది. ఈ ఏడాది ఈ కంపెనీ విలువ 15 శాతం పెరిగి 2.4 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.
  • యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ఆల్ఫాబెట్‌ (గూగుల్‌).. ఈ 4 సంస్థల సంయుక్త విలువ 8 లక్షల కోట్ల డాలర్లకు చేరడంతో హురున్‌ గ్లోబల్‌ 500 కంపెనీల విలువ 14 శాతం మేర పెరిగింది.
  • జాబితాలో చోటు సంపాదించిన దేశాల పరంగా చూస్తే 12 కంపెనీలతో భారత్‌ 9వ స్థానంలో నిలవగా, అమెరికా (243), చైనా (47), జపాన్‌ (30), యూకే (24) అగ్రస్థానాల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి:మన రోడ్లపై 2 లక్షల కియా సెల్టోస్ కార్ల రయ్​రయ్​

ఇదీ చూడండి:'నో కాస్ట్' ఈఎంఐ అసలు రహస్యం ఇది!

Last Updated : Aug 21, 2021, 8:56 AM IST

ABOUT THE AUTHOR

...view details