యూజర్ల నుంచి సర్వీస్ ఛార్జీలు వసూలు చేయడం ద్వారా టెలికాం రంగంలో స్థిరమైన వృద్ధి కొనసాగుతుందని ఇండియన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ(ఐసీఆర్ఏ) సోమవారం తెలిపింది. ఇలా చేయడం వల్ల పరిశ్రమకు ఆదాయంతో పాటు మార్జిన్ కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ పరిశ్రమ మొత్తం అప్పు రూ.5 లక్షల కోట్లుగా ఉండొచ్చని అంచనా వేసింది.
వినియోగదారులపై మరోసారి సుంకం పెంచితే వచ్చే ఆదాయం పరిశ్రమకు దన్నుగా నిలుస్తుందని పేర్కొంది ఐసీఆర్ఏ. అయితే ఉన్న అప్పు మాత్రం అలానే కొనసాగుతుందని వెల్లడించింది. ఇటీవల ముగిసిన స్పెక్ట్రం వేలంతో సంస్థల రుణాలు మరింత పెరిగాయని తెలిపిన ఐసీఆర్ఏ.. ఇవే పరిశ్రమ ఎదుగుదలకు అవరోధంగా మారాయని వివరించింది.
"వినియోగదారులు 2 జీ నుంచి 4జీకి అప్గ్రేడ్ అయ్యారు. దీంతో టెలిఫోన్ సేవల వాడకం కూడా పెరిగింది. ఈ కారణంగా టారీఫ్ ఛార్జి రూ. 220కు చేరింది. రాబోయే రెండేళ్లలో పరిశ్రమల ఆదాయం సంవత్సరానికి 11-13 శాతం వృద్ధి చెందుతుంది."