తెలంగాణ

telangana

ETV Bharat / business

లక్ష్మీ విలాస్ బ్యాంకు విలీనం లేనట్లే! - rbi latest news

చెన్నై ఆధారిత లక్ష్మీ విలాస్​ బ్యాంకు విలీనానికి ఆర్​బీఐ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తలెత్తిన యాజమాన్య సంక్షోభానికి మార్కెట్​ ఆధారిత పరిష్కారానికే మొగ్గు చూపనున్నట్లు ఆర్​బీఐ వర్గాలు తెలిపాయి. సరైన ప్రమాణాలు, సామర్థ్యం ఉన్న సంస్థ ముందుకు వస్తే యాజమాన్య మార్పునకు అంగీకరిస్తామని స్పష్టం చేశాయి.

RBI
లక్ష్మి విలాస్ బ్యాంకు విలీనం

By

Published : Sep 30, 2020, 11:52 AM IST

యాజమాన్య సంక్షోభంలో తలెత్తిన లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను ప్రభుత్వ రంగ బ్యాంకులతో విలీనం చేయడానికి ఆర్​బీఐ అనుకూలంగా లేదని తెలుస్తోంది. చెన్నై ఆధారిత బ్యాంకును కాపాడటానికి ప్రభుత్వ పరిష్కారం కన్నా మార్కెట్ ఆధారంగా వ్యవహరించాలని ఆర్​బీఐ భావిస్తున్నట్లు సమాచారం.

ఎస్​ బ్యాంక్ విషయంలోనూ మార్కెట్ ఆధారిత పరిష్కారానికే ఆర్​బీఐ మొగ్గు చూపిందని సీనియర్​ అధికారి ఒకరు ఈటీవీ భారత్​కు తెలిపారు. ఏదైనా సంస్థ లేదా బ్యాంకు ఆసక్తి కనబరిస్తే ఆర్​బీఐ యాజమాన్య మార్పునకు అంగీకరిస్తుందని వెల్లడించారు. అందుకు సదరు సంస్థలకు పూర్తి సామర్థ్యంతో పాటు సరైన ప్రమాణాలు ఉండాలని స్పష్టం చేశారు.

ఏజీఎంలో మొదలైన సమస్య..

గత వారం జరిగిన లక్ష్మీ విలాస్ బ్యాంక్ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో సంస్థలోని నిర్వహణ లోపాలు బయటపడ్డాయి. కరోనా నేపథ్యంలో దృశ్యమాధ్యమంలో జరిగిన ఈ సమావేశంలో బ్యాంకు ఎండీ, సీఈఓ సుందర్​ సహా ఆరుగురు డైరెక్టర్ల పునర్​ నియామకానికి వ్యతిరేకంగా వాటాదారులు ఓటు వేశారు.

ఈ పరిణామంతో 90 ఏళ్ల చరిత్ర కలిగిన బ్యాంకు విషయంలో బ్యాంకింగ్​, ఫైనాన్షియల్ రంగంలో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ సంస్థను ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులో విలీనం చేయాలని డిమాండ్లు వినిపించాయి.

డిపాజిటర్ల డబ్బు సురక్షితం..

ప్రస్తుతం బ్యాంకు వ్యవహారాలు చూసుకునేందుకు ముగ్గురు డైరెక్టర్ల కమిటీని ఆర్​బీఐ నియమించింది. ఇందులో మాజీ ఐఏఎస్ అధికారులు మీటా మఖాన్​, శక్తి సిన్హా, ఆంధ్రాబ్యాంక్ మాజీ అధికారి సతీశ్ కుమార్ కల్రా ఉన్నారు. కొత్త బోర్డు ఏర్పాటయ్యే వరకు వీరే బాధ్యతలు నిర్వహిస్తారు.

కొత్త బోర్డు ఏర్పాటుకు వాటాదారులతో పాటు అంతిమంగా ఆర్​బీఐ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే, ఇతర బ్యాంకుల తరహాలో ఈ సంస్థకు బయట ఎలాంటి బకాయిలు లేవని, అందువల్ల నగదు ఉపసంహరణపై ఎలాంటి ఆంక్షలు విధించలేమని ఆర్​బీఐ వర్గాలు తెలిపాయి. బ్యాంకు సాధారణ కార్యకలాపాలు నిర్వహిస్తుందని, డిపాజిటర్ల డబ్బు సురక్షితంగా ఉంటుందని స్పష్టం చేశారు.

(రచయిత- కృష్ణానంద్ త్రిపాఠి, డిప్యూటీ న్యూస్ ఎడిటర్, ఈటీవీ భారత్)

ఇద చూడండి:సహకారానికి రిజర్వ్‌ బ్యాంకే జవాబుదారీ!

ABOUT THE AUTHOR

...view details