తెలంగాణ

telangana

ETV Bharat / business

Ratan Tata: 'ఆమె'పై ప్రేమతోనే భారత్​కు రతన్​ టాటా!

వ్యాపారం అనే పరమపద సోపాన పటంలో అనేక నిచ్చెనలు ఎక్కి.. మరెందరినో ఎక్కించిన గొప్ప పారిశ్రామికవేత్త రతన్ టాటా (Ratan Tata). అంచెలంచలుగా ఎదిగిన ఈ దిగ్గజం.. మొదటగా అమెరికాలో స్థిరపడాలని అనుకున్నారట. కానీ తాను ఎంతగానో పేమించే 'ఆమె' కోసం భారత్​కు తిరిగి వచ్చేశారు. ఇంతకీ 'ఆమె' ఎవరు?

Ratan Tata
రతన్‌ టాటా

By

Published : Sep 7, 2021, 10:23 AM IST

టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌లోని తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పిన కుటుంబం. విలువలు, దాతృత్వానికి పెట్టింది పేరు. జంషేడ్జీతో మొదలైన టాటా ప్రయాణం నేటి రతన్‌ టాటా (Ratan Tata) వరకు దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో వచ్చిన టాటా వారసులు సంస్థను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా సంస్థకు ఆధునిక సొబగులద్ది, ఐటీ విభాగాన్ని సంస్థకు మూలస్తంభంగా మార్చడంలో రతన్‌ టాటా కీలక పాత్ర పోషించారు. ఆయన్ని ఇంటర్వ్యూ చేసి పీటర్‌ కేసే అనే రచయిత 'ది స్టోరీ ఆఫ్‌ టాటా-1868 టు 2021' అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు. అందులో రతన్‌ టాటా జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు..

రతన్‌ ఆడిన ఆట అదొక్కటే..

రతన్‌ టాటాను ఆయన నాన్మమ్మ ముంబయిలోని క్యాంపియన్‌ స్కూల్‌లో చేర్పించారు. టాటా కుటుంబాన్ని దాటి బయటి ప్రపంచం పరిచయం కావడం రతన్‌కు అదే మొదటిసారి. కూపరేజ్‌ రోడ్‌ ప్రాంతంలో ఉన్న ఆ స్కూల్‌ దగ్గర్లోనే సాకర్‌ స్టేడియం ఉండేది. కానీ, రతన్‌కు మాత్రం ఆటలంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. రతన్‌, ఆయన సోదరుడిని స్కూల్‌ నుంచి తీసుకురావడానికి వాళ్ల నాన్మమ్మ ఓ పాత భారీ రోల్స్ రాయిస్‌ కారును పంపేది. దాంట్లో ఎక్కడానికి రతన్‌, ఆయన సోదరుడికి సిగ్గుగా అనిపించేదట! ఇంటికి నడుచుకుంటూనే వెళ్లేవారు. తన జీవితంలో తాను ఆడినట్లు గుర్తున్న ఒకే ఒక్క ఆట అదొక్కటే(నడిచి వెళ్లడం) అంటారు రతన్‌ టాటా. తర్వాత కొన్నాళ్లకు స్కూల్‌కు కొద్ది దూరం వరకు కారులో వెళ్లి అక్కడి నుంచి దిగి నడుచుకుంటూ వెళ్లేవారట! తద్వారా తన స్నేహితులు తాను చెడిపోయానని అనుకునే అవకాశం ఉండదని రతన్‌ అనుకునేవారట.

ఫిజిక్స్‌ అంటే మక్కువ.. ఎందుకంటే..

క్యాంపియన్‌లో చదువుతుండగా.. రతన్‌ టాటాకు భౌతిక శాస్త్రమంటే ఆసక్తిగా ఉండేది. ఎంత పెద్ద ప్రశ్నలైనా అడిగేందుకు ఫిజక్స్‌లో అవకాశముంటుందని.. రసాయనశాస్త్రంలో ఆ సదుపాయం ఉండదని రతన్‌ అభిప్రాయం. క్యాంపియన్‌లో సరైన వసతులు లేకపోవడంతో తర్వాత రతన్‌ ఆయన స్నేహితులు కేథడ్రల్‌, జాన్‌ కేనన్‌ స్కూల్‌లో చేరారు. భారత్‌లో ధనవంతులంతా అక్కడే చదివేవారు.

ఆ భయాన్ని జయించలేకపోయారు..

చదువుకునే రోజుల్లో బహిరంగంగా మాట్లాడాలంటే రతన్‌ టాటా భయపడేవారట. స్కూల్లో జరిగే చర్చా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన ఎప్పుడూ పాల్గొనలేదు. ఒకానొక సమయంలో అసలు తాను గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేస్తానా? అని కూడా అనుమానపడ్డారు. కేథడ్రల్‌లో తనకు గణితం బోధించిన ఉపాధ్యాయుడు సైతం అదే అనుకుని ఉంటారని రతన్‌ గుర్తుచేసుకున్నారు.

అలా భారత్‌కు తిరిగి వచ్చి..

రతన్‌ అమెరికాలో ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన తర్వాత భారత్‌కు రావాలని అనుకోలేదు. అక్కడ లభించిన స్వేచ్ఛను ఆయన కోల్పోవాలనుకోలేదు. కానీ, ఆయన నాన్నమ్మ నవాజ్‌భాయ్‌పై ఉన్న ప్రేమే ఆయనను భారత్‌కు తిరిగి తీసుకొచ్చింది. ఆమె అనారోగ్యంతో ఉండడంతో ఆయన తిరిగి భారత్‌కు రాక తప్పలేదు. అలా నవాజ్‌భాయ్‌ దీర్ఘకాలంలో అనారోగ్యంతో ఉండడంతో ఆయన ఇక భారత్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అలా తర్వాతి కాలంలో నెమ్మదిగా టాటా గ్రూప్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అక్కడ ఆయనకు ఎదురైన సవాళ్లే.. వ్యాపారంలో తద్వారా భారత్‌లో ఆయన ఉండేలా చేశాయి.

నిశ్చితార్థం వరకు వెళ్లి..

రతన్‌ టాటా పెళ్లి చేసుకోలేదని చాలా మందికి తెలుసు. కానీ, ఆయన పెళ్లి నిశ్చితార్థం వరకు వెళ్లి ఆగిపోయిందని కొంతమందికే తెలుసు. దాదాపు పెళ్లి కార్డులు ప్రింటింగ్‌ వరకు వెళ్లారట! తర్వాత ఆయన ఇక జీవితంలో వివాహం ఊసెత్తలేదు. బహుశా, ఆయన తల్లిదండ్రులు విడిపోవడం వల్లే ఆయన పెళ్లికి దూరంగా ఉండడానికి కారణమై ఉంటుందని సన్నిహితులు చెబుతుంటారు.

సున్నపు రాయిని ఎత్తి..

రతన్‌ టాటా నేరుగా ఉన్నత పదవులను అలంకరించలేదు. జేఆర్డీ టాటా ఆదేశాల మేరకు తొలి రెండు సంవత్సరాలు ఆయన కంపెనీ విభాగాల్లో కిందిస్థాయిల్లో పని చేశారు. తొలి ఆరు నెలలు టాటా ఇంజినీరింగ్‌ అండ్‌ లోకొమోటివ్‌ కంపెనీ-టెల్కోలో చేరారు. అనంతరం టాటా ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ లిమిటెడ్‌(టిస్కో)కు మారారు. ఇక్కడ ఆయన సున్నపురాయిని ఎత్తడం, బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను చూసుకోవడం వంటి క్షేత్రస్థాయి పనులను కూడా చూసుకున్నారు. అక్కడి నుంచి ఆయన పనితీరును మెచ్చి ఇంజినీరింగ్‌ విభాగానికి బదిలీ చేశారు. అనంతరం టిస్కో సీఈఓకి సాంకేతిక సహాయకుడిగా మార్చారు. రతన్‌ పనితీరుపై జేఆర్డీకి సానుకూల నివేదికలు అందడంతో ముంబయికి పిలిచి నష్టాల్లో ఉన్న నెల్కో, సెంట్రల్‌ ఇండియా టెక్స్‌టైల్స్ బాధ్యతలు అప్పగించారు. బహుశా తనని రాటుదేల్చడానికే జేఆర్డీ ఆ బాధ్యతల్ని తనకు అప్పగించి ఉంటారని రతన్‌ అంటారు. టెక్స్‌టైల్‌ బిజినెస్‌ను కొన్నేళ్లలోనే లాభాల పరుగు పెట్టించారు. కానీ, నెల్కోని మాత్రం నెట్టుకురాలేకపోయారు. అయితే, ఈ సంస్థ మార్కెట్‌ వాటాను మాత్రం రెండు శాతం నుంచి 25 శాతానికి పెంచగలిగారు.

ఇదీ చూడండి:reliance jio: జియో డేటా విప్లవానికి 5 ఏళ్లు- టెక్ కంపెనీల అభినందనలు

ABOUT THE AUTHOR

...view details