Small Scale Industries: భారత తయారీ సామర్థ్యంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) వాటా మూడో వంతుకు పైగా ఉంటుంది. స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 30శాతం, ఎగుమతుల్లో 45శాతానికి పైగా అవే సమకూరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా విస్తరించిన 6.3 కోట్ల ఎంఎస్‌ఎంఈలు సుమారు 12 కోట్ల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయి. వస్తువులు, సరకుల తయారీ, ఉత్పత్తి, నిర్వహణ, సంరక్షణ రంగాల్లో సేవలందిస్తున్న ఈ పరిశ్రమలు ఆర్థికాభివృద్ధితో పాటు ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. గ్రామీణ, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. దేశార్థికానికి వెన్నెముక వంటి ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక ప్రోత్సాహకాలు లభిస్తున్నా- ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇతోధికం చేసి వాటిని మరింతగా వృద్ధి చేసేందుకు అవి సరిపోవడం లేదు.
ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావం
కొవిడ్ కారణంగా దేశంలోని 35శాతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతబడ్డాయని, స్వయంఉపాధి పొందుతున్న వ్యక్తుల్లో 37శాతం వరకు తమ వ్యాపారాలను మూసేశారని అఖిల భారత తయారీదారుల సంఘం సర్వే నిగ్గుతేల్చింది. పోనుపోను కొండెక్కుతున్న ముడిసరకుల ధరలు ఎంఎస్‌ఎంఈలను చిదిమేస్తున్నాయి. గిరాకీ లేకపోయినప్పటికీ ధరలు పెరుగుతుండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. పలు కారణాలతో దిగుమతులు కోసుకుపోవడమూ ప్రభావం చూపుతోంది. అదే అదునుగా దేశీయ తయారీదారులు తమ ఉత్పత్తుల ధరలను అమాంతం పెంచేశారు. ఈ పరిణామాలు వస్తుసరకుల రంగంలోని బడా కంపెనీలకు మేలు చేసినా, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు అవి పెనువిఘాతాలయ్యాయి. ఉక్కు, ఇనుముపై అధికంగా ఆధారపడే ఇంజినీరింగ్ పరిశ్రమలు చితికిపోయాయి. రాబోయే కొద్ది రోజుల పాటు ధరల పెరుగుదల ఇలాగే ఉంటే ఆయా సంస్థల లాభాలు కోసుకుపోతాయి. ఈ దుస్థితి దీర్ఘకాలం కొనసాగితే మరింత చేటు తప్పదు! పరిశ్రమలు ముడిసరకులకు బదులుగా పూర్తిగా తయారైన వస్తువుల దిగుమతి వైపే మొగ్గుచూపవచ్చు. ఆత్మనిర్భర్ కార్యక్రమం ద్వారా ప్రపంచ తయారీ రంగంలో భారత భాగస్వామ్యాన్ని ఇనుమడింపజేయాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి అది విఘాతమవుతుంది. ముడిసరకుల ధరలు దిగిరాకపోతే పరిశ్రమలు మూతపడి, ఉద్యోగాలకు భారీస్థాయిలో కోతపడవచ్చు. అంతిమంగా ఇవన్నీ కలిసి దేశీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్రస్థాయిలో ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం నెలకొంది. భారత్‌తో పోలిస్తే వస్త్రాల ఎగుమతిలో పొరుగు దేశం బంగ్లాదేశ్ ముందంజలో ఉంది. దేశీయ తయారీదారులకు అక్కడి ప్రభుత్వం సమధికంగా చేయూతనివ్వడమే అందుకు కారణం! ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా కేంద్రం అత్యవసర రుణహామీ పథకాన్ని (ఈసీఎల్‌జీఎస్) ప్రవేశపెట్టింది. దాని కింద వ్యాపార రుణాలకు ప్రభుత్వ హామీ లభిస్తోంది. 2021 సెప్టెంబర్ నాటికి రూ.2.86 లక్షల కోట్ల మేరకు రుణాలు మంజూరయ్యాయి. భారతీయ ఎంఎస్‌ఎంఈల్లో చాలాకొద్ది శాతమే ఈసీఎల్‌జీఎస్‌ను వినియోగించుకున్నాయి. ఇప్పటికే అప్పుల భారంతో కుదేలవుతున్న పరిశ్రమలు, కొత్త రుణాలు తీసుకునేందుకు వెనకాడుతున్నాయి.