పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆస్తులు మరోసారి వేలానికి వచ్చాయి. ఇందులో అరుదైన పెయింటింగ్స్, అత్యంత విలువైన చేతి గడియారాలు, విలాసవంతమైన కార్లు ఉన్నాయి.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యక్ష వేలం జరగనుంది. ఇందులో నీరవ్ మోదీకి చెందిన 112 విలువైన (ఆస్తులు) వస్తువులను వేలం వేయనున్నారు. మార్చి 3, 4 తేదీల్లో నీరవ్‌కు చెందిన ఇంకో 72 వస్తువులకు ఆన్లైన్ వేలం నిర్వహించనున్నారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతేడాది మార్చిలో నీరవ్ మోదీకి చెందిన రూ.55 కోట్ల విలువైన కళాకృతులను వేలం వేసిన విషయం తెలిసిందే.
బాయ్స్ విత్ లెమన్స్
1935లో అమృతా షేర్ గిల్ గీసిన 'బాయ్స్ విత్ లెమన్స్' చిత్రం ఈ వేలం పాటలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, సుమారుగా రూ.12 కోట్ల నుంచి రూ.18 కోట్లు వరకు ధర పలుకుతుందని భావిస్తున్నారు.
1972లో ప్రఖ్యాత పెయింటర్ ఎంఎఫ్ హుస్సేన్ గీసిన చిత్రం కూడా మంచి ధరను పొందవచ్చని ఆశిస్తున్నారు. వీటితో పాటు వీఎస్ గైతోండే, మంజిత్ బావా, రాజా రవివర్మ చిత్రాలు కూడా వేలంలో ఉన్నాయి.
70 లక్షల చేతిగడియారం
రూ.70 లక్షల విలువ చేసే జేగర్-లీకాల్టర్ మెన్స్‌కు చెందిన లిమిటెడ్ ఎడిషన్ రిస్ట్‌వాచ్ వేలంలో ఉండనుంది. అలాగే పటేక్ ఫిలిప్ 'నాటిలస్' గోల్డ్, డైమండ్ రిస్ట్‌వాచ్ వేలంలో రూ.70 లక్షల వరకు పలకవచ్చని భావిస్తున్నారు.