PM Modi on Deposit Insurance: భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. పేదలకు లబ్ధి చేకూర్చేలా గత ఏడేళ్లలో ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం ఎన్నో సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన డిపాజిట్ ఇన్సూరెన్స్ సంస్కరణలు బ్యాంకింగ్ వ్యవస్థపై ఖాతాదారులకు విశ్వాసాన్ని కలిగిస్తాయని ప్రధాని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో పేద, మధ్య తరగతి ప్రజలు బ్యాంకింగ్ సంక్షోభంతో పదే పదే ఇబ్బంది పడ్డారని.. అయితే ఈ సమస్యలను పరిష్కరించడానికి నవ భారత్ కృతనిశ్చయంతో ఉందన్నారు.
Bank Deposit Insurance: 'డిపాజిటర్స్ ఫస్ట్: రూ.5 లక్షల వరకు గ్యారెంటీడ్ టైమ్-బౌండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ చెల్లింపు'పై దిల్లీలో నిర్వహించిన సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (సవరణ) బిల్లు, 2021 ఆమోదించిన కొన్ని రోజులకే.. లక్ష మందికిపైగా ఖాతాదారులు తమ డబ్బును తిరిగి పొందారని.. ఇది రూ.1300 కోట్లకుపైగా ఉంటుందని మోదీ తెలిపారు. మరో మూడు లక్షల మంది ఖాతాదారులు త్వరలో ఆర్‌బీఐ మారటోరియం కింద ఉన్న బ్యాంకుల్లో తమ డిపాజిట్లను పొందుతారని ప్రధాని హామీ ఇచ్చారు.
"ఏళ్ల తరబడి సమస్యలను పక్కదారి పట్టించే ధోరణి మన దేశంలో నెలకొంది. పేద, మధ్యతరగతి ప్రజలు.. బ్యాంకింగ్ సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్నారు. కానీ నయా భారత్.. ఈ సమస్యలను పరిష్కరించాలనే కృతనిశ్చయంతో ఉంది. బ్యాంకింగ్ రంగానికి ఈ రోజు చాలా ముఖ్యమైంది. 'డిపాజిటర్లు ఫస్ట్' కార్యక్రమం పేరు.. ఖాతాదారుల పట్ల, వారి అవసరాల పట్ల ప్రాధాన్యం, బాధ్యతను ప్రతిబింబిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, డిపాజిటర్లలో నమ్మకాన్ని పెంపొందించడానికి మేము ఈ డిపాజిటర్లకు పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచాం."
- ప్రధాని నరేంద్ర మోదీ