తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్​కు పెప్సీ నుంచి 25వేల కరోనా టెస్టింగ్​ కిట్లు - పెప్సికో ఇండియా

కరోనా మహమ్మారితో పోరాటానికి దిగ్గజ సంస్థలు ముందుకొస్తున్నాయి. పెప్సికో ఇండియా భారత్​కు 25,000 కరోనా టెస్టింగ్​ కిట్​లు అందించనున్నట్లు ప్రకటించింది. నిరుపేదలకు 50 లక్షల భోజనాలు ఏర్పాటుచేయనున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు టెక్ దిగ్గజం యాపిల్ మాస్కుల తయారీ చేపడుతోంది. వారానికి మిలియన్ సర్జికల్ మాస్కులు చొప్పున ఉత్పత్తి చేయనున్నట్లు స్పష్టం చేసింది.

PepsiCo commits 25,000 COVID-19 testing kits, over 5 million meals to India
భారత్​కు 25,000 కొవిడ్​-19 టెస్టింగ్​ కిట్లు అందిస్తాం: పెప్సికో

By

Published : Apr 6, 2020, 1:27 PM IST

కరోనాతో పోరాడుతున్న భారత దేశానికి చేయూతనందించేందుకు పెప్సికో ఇండియా ముందుకొచ్చింది. తన మాతృసంస్థకు చెందిన పెప్సికో ఫౌండేషన్​తో కలిసి 25,000 కొవిడ్​-19 టెస్టింగ్​ కిట్లు భారత్​కు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఆకలితో అలమటిస్తున్న నిరుపేద కుటుంబాలకు 50 లక్షల భోజనాలు అందించనున్నట్లు పేర్కొంది.

'అక్షయ పాత్ర'తో కలిసి

పెప్సికో ఇండియా... వండిన భోజనం పంపిణీ చేయడానికి అక్షయ పాత్రతో, కుటుంబాలకు 'డ్రై ఫుడ్​ రేషన్​' అందించేందుకు స్మైల్​ ఫౌండేషన్​తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వీటి సాయంతో కరోనా బారిన పడిన 8,000 కుటుంబాలకు భోజన వసతి కల్పించనున్నట్లు పేర్కొంది.

పెప్సికో ఇండియా తన మాతృసంస్థకు చెందిన 'గివ్​ మీల్స్, గివ్​ హోప్​' అనే గ్లోబల్​ ప్రోగ్రామ్​లో భాగంగా ఈ దాతృత్వ కార్యక్రమం చేపట్టింది.

'ఫైండ్​' భాగస్వామ్యంతో..

పెప్సికో ఇండియా 25,000 కొవిడ్​-19 పరీక్ష కిట్​లను భారత్​కు అందించేందుకు... లాభాపేక్షలేని సంస్థ 'ఫౌండేషన్ ఆఫ్ ఇన్నోవేటివ్ న్యూ డయాగ్నోస్టిక్స్ (ఎఫ్​ఐఎన్​డీ)'తో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన 'ఎఫ్​ఐఎన్​డీ' ఇప్పటికే భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది.

యాపిల్ దాతృత్వం

కరోనా మహమ్మారితో పోరాడుతున్న వైద్య, ఆరోగ్య కార్యకర్తల కోసం త్వరలో వారానికి ఓ మిలియన్ ఫేస్ షీల్డ్స్ ఉత్పత్తి చేయనున్నట్లు యాపిల్ సంస్థ తెలిపింది.

"ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్జికల్ మాస్కుల కొరతను తీర్చేందుకు యాపిల్ ఇప్పటికే 20 మిలియన్ మాస్కులను అందించింది. ఈ వారాంతానికి మరో మిలియన్ మాస్కులు అందించాలని ప్రణాళిక వేసుకున్నాం."-టిమ్​ కుక్​, యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్​ ట్వీట్​

యాపిల్ ఇప్పటికే సొంతంగా ఓ పారదర్శక మాస్కును రూపొందించి... అమెరికా, చైనాల్లోని తన కర్మాగారాల్లో భారీగా ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. అలాగే ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ ప్రాడా సహా అనేక కంపెనీలతో కలిసి మాస్కుల ఉత్పత్తికి కృషి చేస్తోంది ఈ దిగ్గజ సంస్థ. ముందుగా అమెరికాకు వీటిని అందించి, తరువాత ప్రపంచ దేశాలకు కూడా పంపిణీ చేయాలని యాపిల్​ భావిస్తోంది.

ఇదీ చూడండి:జీవిత బీమా ప్రీమియం చెల్లింపునకు గడువు పెంపు

ABOUT THE AUTHOR

...view details