తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇంతకీ క్రెడిట్‌ కార్డు బిల్లులు చెల్లించాలా? వద్దా? - latest business news

పరిమిత కాలంలో రుణ వాయిదాల చెల్లింపులపై మూడు నెలలపాటు మారటోరియానికి అనుమతి ఇచ్చింది భారతీయ రిజర్వు బ్యాంకు. 2020 మార్చి 1 నుంచి వచ్చే మూడు నెలల వరకు ఇది వర్తిస్తుంది. అయితే చాలామందికి ఈ వార్త తెలిసినప్పటి నుంచి క్రెడిట్‌కార్డు రుణ వాయిదాలకు ఇది వర్తిస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తాయి. వాటికి ఆర్థిక నిపుణుల సమాధానాలు ఇవే.

Pay Credit Card Loans? Whether or not?
ఇంతకూ క్రెడిట్‌ కార్డు రుణాలు చెల్లించాలా? వద్దా?

By

Published : Mar 27, 2020, 7:00 PM IST

కాల పరిమితితో కూడిన రుణ వాయిదాల చెల్లింపులపై భారతీయ రిజర్వు బ్యాంకు మూడు నెలల పాటు మారటోరియానికి అనుమతి ఇచ్చింది. 2020, మార్చి 1నుంచి మూడు నెలల వరకు ఇది వర్తిస్తుంది. జాతీయ, ప్రాంతీయ, గ్రామీణ, సహకార బ్యాంకులు, గృహ రుణాలు అందజేసే సంస్థలు, ఎన్‌బీఎఫ్‌సీలు దీని పరిధిలోకి వస్తాయి. కాగా, ఈ ప్రయోజనాలు వినియోగదారులకు బదిలీ చేయాలా? లేదా అని నిర్ణయించుకొనేది బ్యాంకులే.

ఆ సంస్థలు ప్రస్తుతానికి ఏ నిర్ణయం తీసుకోలేదు. బ్యాంకులు దీనికి ఆమోదం తెలిపితేనే వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే చాలామందికి మారటోరియం వార్త తెలిసినప్పటి నుంచి కొన్ని సందేహాలు కలిగాయి. ఈ నెల వాయిదాను బ్యాంకు పరిగణించిందో లేదో ఎలా తెలుస్తుంది? క్రెడిట్‌కార్డు రుణ వాయిదాలకు ఇది వర్తిస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తాయి. వాటికి ఆర్థిక నిపుణుల సమాధానాలు ఇవే.

త్వరలోనే నేను ఈఎమ్‌ఐ చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు నా ఖాతాలో డబ్బులు అలాగే ఉంటాయా?

మారటోరియం అమలు చేసేందుకు బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతించింది. అయితే నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం బ్యాంకులే. వారు అంగీకరించకపోతే మీరు వాయిదా చెల్లించాల్సిందే.

నా ఈఎమ్‌ఐ వాయిదా వేశారో లేదో ఎలా తెలుస్తుంది?

ఆర్‌బీఐ ఇప్పటికైతే వివరాలేమీ ఇవ్వలేదు. మార్గదర్శకాలు విడుదల చేస్తేనే స్పష్టత వస్తుంది.

బ్యాంకులు ఈ ప్రక్రియను ఎలా మొదలు పెడతాయి?

బ్యాంకులన్నీ కలిసి మారటోరియంపై చర్చిస్తాయి. బోర్డు స్థాయిలో నిర్ణయం తీసుకుంటాయి. మారటోరియం ఆమోదిస్తే ఆ విషయాన్ని వినియోగదారులకు తెలియజేస్తాయి.

బ్యాంకు నా ఈఎమ్‌ఐ వాయిదా వేస్తే నా క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటుందా?

లేదు. మీ క్రెడిట్‌ స్కోరుకు ఇబ్బందేమీ లేదు.

ఇప్పుడు ఆర్‌బీఐ చేసేది వాయిదానా లేదా రద్దా?

ఇది రద్దు కాదు. వాయిదా మాత్రమే. బ్యాంకులు మారటోరియం ఆమోదిస్తే మీరు చెల్లించాల్సిన వాయిదాల కాలపరిమితి ఇప్పుడు తగ్గి మూడు నెలలు పెరుగుతుంది.

మారటోరియం అసలు, వడ్డీ రెండింటిపై ఉంటుందా?

అవును. అసలు, వడ్డీ రెండింటిపై మారటోరియం ఉంటుంది. ఇప్పుడు వాయిదా వేసే మొత్తంలో అసలు, వడ్డీ కలిపే ఉంటుంది.

ఏయే రుణాలు మారటోరియం పరిధిలోకి వస్తాయి?

కాలపరిమితి (టెర్మ్‌)తో కూడిన రుణాలన్నీ మారటోరియం కిందకు వస్తాయని ఆర్‌బీఐ తెలిపింది. ఇందులో గృహ, వ్యక్తిగత, విద్య, వాహన ఇతర రుణాలు ఉంటాయి. టీవీ, మొబైల్‌, ఫ్రిడ్జ్‌ వంటి గృహ వినియోగ వస్తువులపై తీసుకున్న రుణాలకూ ఇది వర్తిస్తుంది.

క్రెడిట్‌ కార్డు చెల్లింపులపై మారటోరియం వర్తిస్తుందా?

క్రెడిట్‌ కార్డు చెల్లింపులు కాలపరిమితి రుణాల కిందకు రావు. కాబట్టి ఇవి మారటోరియం పరిధిలోకి రావు.

ABOUT THE AUTHOR

...view details