దేశంలో 15 ఏళ్లకు పైబడిన వాహనాలు 4 కోట్లు ఉన్నాయి. వీటిలో 2 కోట్ల వాహనాలు 20 ఏళ్లకు పైబడినవి కావడం గమనార్హం. ఈ గణాంకాలను డిజిటలైజ్ చేసిన కేంద్రం ఈ వాహనాలపై హరిత పన్ను విధించాలనే ప్రతిపాదనను ఆయా రాష్ట్రాలకు పంపింది. 70 లక్షల వాహనాలతో ఈ జాబితాలో కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా.. 56.54 లక్షల వాహనాలతో ఉత్తర ప్రదేశ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. 49.93 లక్షలతో దిల్లీ మూడో స్థానంలో ఉంది.
వాహన డిజిటలైజేషన్‌లో కేరళలో 34.64 లక్షల వాహనాలతో టాప్‌లో ఉంది. ఆ తరువాత 33.43 లక్షలతో తమిళనాడు, 25.38 లక్షలతో పంజాబ్ వరుస స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, లక్షద్వీప్ నుంచి దీనికి సంబంధించిన డేటా అందలేదని కేంద్ర రవాణా శాఖ తెలిపింది.
వాతావరణాన్ని కాపాడేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు 15 ఏళ్లకుపైబడిన పాత వాహనాలపై హరిత పన్ను విధించాలని కేంద్రం నిర్ణయించింది. దీని ప్రకారం సీఎన్జీ, ఇథనాల్, ఎల్పీజీతో నడిచే వాహనాలకు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. గ్రీన్ ట్యాక్స్ ద్వారా వసూలైన సొమ్మును కాలుష్యాన్ని అరికట్టడానికి వినియోగించనున్నారు. ఎక్కువ కాలుష్యం ఉన్న నగరాల్లో రిజిస్టర్ అయిన వాహనాలకు అధిక హరిత పన్ను విధించనున్నారు. వీటిపై రోడ్డు ట్యాక్స్‌లో 50 శాతం హరిత పన్ను పడనుంది. బస్సులు వంటి ప్రజా రవాణా వాహనాలకు గ్రీన్స్ ట్యాక్స్ తక్కువగా ఉండనుంది.
పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న పాత వాహనాలపై హరిత పన్ను విధించే ప్రతిపాదనకు ప్రభుత్వం జనవరిలో ఆమోదం తెలిపింది.
ఇదీ చూడండి:చైనాకు పెరిగిన ఇంజినీరింగ్ ఎగుమతులు