ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లాను(Tesla India) భారత్‌లో తయారీ చేపట్టాలని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ కోరారు. ప్రభుత్వం తప్పకుండా పన్ను ప్రయోజనాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. పబ్లిక్ ఫోరం ఆఫ్ ఇండియా(పీఏఎఫ్‌ఐ) నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తొలుత విదేశాల్లో ఉత్పత్తి చేసిన కార్లను భారత్‌కు ఎగుమతి చేస్తామని.. తద్వారా మార్కెట్‌ను పెంచుకొని దేశంలోకి ప్రవేశిస్తామన్న టెస్లా(Tesla news) ప్రతిపాదనకు కాలం చెల్లిందని ఆయన స్పష్టం చేశారు. టెస్లా కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని కోరారు.
ముందు భారత్‌లో తయారీ ప్రారంభించాలని.. ఆ తర్వాతే సుంకాల తగ్గింపు విషయాన్ని పరిశీలిస్తామని టెస్లాకు(Tesla news) కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం ఇటీవల తేల్చి చెప్పారు. జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విపణి కలిగిన భారత్‌లోకి ప్రవేశించేందుకు టెస్లా(tesla news India) గత కొంత కాలంగా కసరత్తు చేస్తోంది. అయితే, సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్(Elon Musk news).. భారత్‌లో కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మరోవైపు టెస్లాకు చెందిన కొన్ని మోడళ్లు భారత్‌లో నడపడానికి అనువైనవిగా కేంద్రం ఇటీవలే ధ్రువీకరించింది.